అమ్మో ఐటీ.. లక్షల్లో ఊడుతున్న ఉద్యోగాలు

మొన్నటివరకు ఐటీ కొలువు అంటే యమా క్రేజ్. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్.. ఐటీ సెక్టార్ తో సంబంధం ఉండే ఏ ఉద్యోగం అయినా జీతభత్యాలు, సౌకర్యాలు ఓ రేంజ్ లో ఉండేవి. కానీ…

మొన్నటివరకు ఐటీ కొలువు అంటే యమా క్రేజ్. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్.. ఐటీ సెక్టార్ తో సంబంధం ఉండే ఏ ఉద్యోగం అయినా జీతభత్యాలు, సౌకర్యాలు ఓ రేంజ్ లో ఉండేవి. కానీ 2023 మాత్రం ఐటీ రంగానికి ఎసరు పెట్టింది. పేరుగొప్ప సంస్థలన్నీ ఉద్యోగుల్ని బయటకు పంపిస్తున్నాయి. లే ఆఫ్ లతో హోరెత్తిస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్.. కంపెనీ ఏదైనా లేఆఫ్ లు కామన్ అనేలా ఉంది పరిస్థితి.

ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 1.10లక్షలు. ఈ ఏడాది లే ఆఫ్ ప్రకటించిన కంపెనీల సంఖ్య 340. ఫిబ్రవరి నెలలో ఈ రోజు వరకు ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 17,400.

ఈ గణాంకాలు చూస్తుంటే ముందు ముందు ఇంకెలాంటి చేదు వార్తలు వినాలో అనిపిస్తోంది. 2022లోనే లే ఆఫ్ సీజన్ మొదలైంది. గతేడాది మొత్తం వెయ్యి కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించుకుంటూ వచ్చాయి. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య కేవలం 1,54,336

ఈ ఏడాది నెలన్నర రోజులు కాకముందే లక్షా పదివేలమంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. అంటే గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఫేస్ బుక్ గరిష్టంగా 11వేల మందిని తొలగించింది. ఈ ఏడాది ఆ ప్రభావం కొనసాగుతుందని తెలుస్తోంది.

రోజుకి 3,300 మందిపై వేటు..

ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీస్తే రోజుకి 3,300 మందిపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. కొత్తగా క్యాంపస్ రిక్రూట్ మెంట్లు చేసుకున్న సంస్థలు కూడా ఇప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నాయి. తమ అంచనాలు అందుకోలేదనే సాకుతో ట్రైనీలను కూడా వెనక్కి పంపించేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాంద్యం పరిస్థితులు ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఐటీరంగంలో ఉన్న భారతీయులు మాత్రం ఈ ఏడాది చుక్కలు చూస్తున్నారు.