నిద్రలో కొన్ని గంటలు తల్లిపాలు లేకపోతేనే పిల్లలు ఏడుపు అందుకుంటారు. అందులోనూ 2 నెలల బిడ్డ, పాల కోసం ఎలా పరితపిస్తుంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది గంటలు కాదు, రోజులు.. ఏకంగా 5 రోజుల పాటు పాలు లేకుండా ఆ శిశువు బతికుందంటే అది గుండెకాదు, ఆ ప్రాణం అంత తేలిగ్గా దేన్నీ లెక్కచేయదని అర్థం.
భూకంపం సంభవించి 5 రోజులవుతున్నా.. టర్కీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద నుంచి శవాల గుట్టలు బయటపడుతూనే ఉన్నాయి. అలాంటిది ఐదోరోజు జరిగిన వెదుకులాటలో ఓ సన్నివేశం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
శిథిలాలు ఒక్కొక్కటీ తొలగిస్తున్న సిబ్బందికి సన్నగా ఏడుపు వినిపించింది. జాగ్రత్తగా ఆ వైపు వెదుకులాడగా రెండు నెలల శిశువు ఆకలితో అలమటిస్తున్న దృశ్యం కనపడింది. భూకంపం సంభవించి దాదాపు 128 గంటల తర్వాత బయటపడిన ఆ బేబీని చూసి అందరూ షాకయ్యారు. కరతాళ ధ్వనుల మధ్య సిబ్బంది ఆ పసిబిడ్డను బయటకు తీసి పాలు పట్టించారు.
టర్కీ భూకంపం తర్వాత శిథిలాల కింద ఎవరైనా బతికుండే అవకాశం ఉంటుందేమోనని వెదుకులాట కొనసాగిస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ఎవరికీ ఆశలు లేవు. టర్కీలో మొత్తం 6వేల బిల్డింగ్ లు కూలిపోయాయి. ఇప్పటివరకు 28వేల మృతదేహాలను వెలికి తీశారు. ఇకపై శవాలే కనపడతాయి, ప్రాణంతో ఉన్నవారెవరూ కనపడరనే ఉద్దేశంతోనే వెదుకులాట చేపడుతున్నారు. అనుకోకుండా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మళ్లీ ఈ లోకంలోకి వచ్చింది ఆ శిశువు.
అంతకంటే ముందు రెండేళ్ల బాలికను, 6 నెలల గర్భవతిని, 70ఏళ్ల ఓ వృద్ధురాలిని కూడా రెస్క్యూటీమ్ రక్షించింది. మిగతావారు ఆకలిని తట్టుకొని బతికారంటే అర్థముంది. కానీ రెండు నెలల పసిగుడ్డు బయటపడటం మాత్రం ఆశ్చర్యకరమైన విషయం.