తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రా జిల్లాలు ఒకప్పుడు కంచుకోటలు. దశాబ్దాలుగా పసుపు జెండా మోస్తూ వచ్చిన ఈ జిల్లాలు 2019లో ఫ్యాన్ నీడకు చేరాయి. ఈ దెబ్బతో తెలుగుదేశానికి అధికారం జారిపోయింది. ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు అంటే మ్యాజిక్ నంబర్ కి సగం కంటే కొంచే తక్కువ. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ తాజా పరిస్థితి ఏంటి అనేది వాకబు చేయడానికి సమీక్ష చేయడానికి చంద్రబాబు టూర్ పెట్టుకున్నారు.
ఈ నెల 25న ఆయన విశాఖలో ఉత్తరాంధ్రా ప్రాంతీయ సదస్సుని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు అన్ని నియోజకవర్గాల నుంచి ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు అందరినీ అహ్వానిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో పార్టీని లేపే పనిలో ఇది సీరియస్ గా చేసే మొదటి కార్యక్రమం అని అంటున్నారు.
పార్టీ జనాలు మూడు వేల మంది దాకా ఈ ప్రాంతీయ సదస్సుకు హాజరవుతారని అంటున్నారు. మార్చి లో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్న నేపధ్యంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో సైకిల్ ఈసారి పరుగులు తీస్తేనే ఏపీలో అధికారం దక్కుతుందని అధినాయకత్వం భావిస్తోంది.
తమ్ముళ్లకు ఈ సదస్సు ద్వారా బాబు ఇచ్చే సందేశం ఏంటి అన్నది ఆసక్తికరంగా ఉంది. పార్టీలో సీనియర్ లీడర్లు ఉన్నారు, యువతకు ప్రోత్సాహం అందిస్తామని చెబుతున్న చెబుతున్న బాబు అందరినీ ఎలా బాలన్స్ చేసి ముందుకు నడిపిస్తారు అన్నది చూడాలి. ఉత్తరాంధ్రా మీద అధికార పార్టీ పూర్తిగా కేంద్రీకరించి పనిచేస్తోంది.
విశాఖకు ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ ని షిఫ్ట్ చేస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో విశాఖ సహా ఉత్తరాంధ్రా మీద తెలుగుదేశం అజెండా ఏంటి పార్టీ ఆలోచనలు ఏంటి అన్నది ప్రాంతీయ సదస్సులో చెబితేనే క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.