ఇంకా పాతకాలం రాజకీయాన్నే చంద్రబాబు అనుసరిస్తున్నారు అని సొంత పార్టీ వారు అంటూంటారు. చంద్రబాబు డెబ్బై దశకం నాటి నాయకుడు. ఇప్పటికి అర్ధ శతాబ్దం క్రితం ఆయన విద్యార్ధి రాజకీయ జీవితం మొదలైంది. నాడున్న పరిస్థితులు వేరు. ఇపుడు కాలం మారింది.
అయినా బాబు మాత్రం రొడ్డ కొట్టుడు రాజకీయమే చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అదే విషయాన్ని చెబుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నిన్ను నమ్మరు బాబూ అంటున్నారు. జగన్ మీద ఎన్ని చెప్పినా ఎంతలా పుస్తకాలు తెచ్చి అచ్చేసినా జనాలు పలకరు అంటున్నారు.
ఈ మధ్యనే జగనాసుర చరిత్ర పేరుతో తెలుగుదేశం పార్టీ పుస్తకం రిలీజ్ చేసింది. ఆ పుస్తకం తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే అని ఆయన మండి పడ్డారు. ఇపుడు అంతా సొషల్ మీడియా యుగం, వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లను అంతా అనుసరిస్తున్నారు అని ఆయన అంటున్నారు.
చంద్రబాబు రాసిన పుస్తకాలు తీసే సినిమాలు ఎవరు చూస్తారని సెటైర్లు వేశారు. టీడీపీకి చంద్రబాబుకు సత్తా ఉంటే తమ పద్నాలుగేళ్ల పాలనను తాము చేసిన కార్యక్రమాలను జనాలలో ఉంచి ఓట్లు అడగాలని ఆయన సవాల్ చేశారు. అలా చెప్పుకోవడానికి ఏమీ లేక తమ నాయకుడు జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన అంటున్నారు.