తెలుగుదేశం నేత, పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి గారు రెడ్డి పౌరుషం గురించి మాట్లాడారు. తను రెడ్డి పౌరుషానికి నిదర్శనం అని, జగన్ మాత్రం కాదని, రెడ్డి పౌరుషం అంటే అవతలి వారిని వేధించడం కాదంటూ ఏదేదో మాట్లాడారు ఈ రెడ్డిగారు!
పలమనేరు వేదికగా ఈయన ఇలా రెడ్డి పౌరుషం గురించి చెప్పుకొచ్చారు! పెద్ద మీసాలున్నాయని ఈ రెడ్డిగారు రెడ్డి పౌరుషం గురించి మాట్లాడారేమో కానీ, ఈయన గారు తను చేసిన ఘనకార్యాలను కూడా తన రెడ్డి పౌరుషానికి నిదర్శనం అనే అంటారా? అనేది ధర్మ సందేహం!
అమర్ నాథ్ రెడ్డి గారు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. అయితే ఆ వెంటనే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అంతే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకున్నారు. ఇలాంటి ఫిరాయింపుతో మంత్రి పదవి తీసుకుని విమర్శలకు గురయ్యారు.
అది అనైతికం. అధర్మం. అయితే నీఛ రాజకీయ వ్యవస్థలో అమర్ నాథ్ రెడ్డి మంత్రి పదవి పొందారు. ఈ తరహా రాజకీయంలో చంద్రబాబుది ఒక నీఛమైన చర్య అయితే, అమర్ నాథ్ రెడ్డి మరో నైచ్యం! తెలుగుదేశం పట్ల అంత మమకారం ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లి, గెలిచి అప్పుడు చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవిని తీసుకుని ఉంటే..అది కదా రెడ్డి పౌరుషం అంటే!
సోనియాతో విబేధించి జగన్ సొంత పార్టీ పెట్టుకున్న వెంటనే తను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. తన తల్లి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత తన వెంట నడిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు! అది కదా.. రాయలసీమ రెడ్డి పౌరుషం అంటే!
ఇవన్నీ ఎవరికి తెలియనివి కావు. అందరికీ అన్నీ తెలుసు. అందుకే అమర్ నాథ్ రెడ్డిని గత ఎన్నికల్లో పలమనేరు ప్రజలు చిత్తుగా ఓడించి కూర్చోబెట్టారు. ఎంతో రాజకీయ నైచ్యానికి పాల్పడిన అమర్ నాథ్ రెడ్డి గారు ఇప్పుడు రెడ్డి పౌరుషం అంటూ మాట్లాడితే రెడ్లే మామూలుగా నవ్వడం లేదు!