తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పాదయాత్ర పేలవమైన రీతిలో సాగుతూ ఉంది. కాలు తొక్కే నాడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్టుగా లోకేష్ పాదయాత్ర ఆరంభంలోనే అతి పేలవంగా మొదలైంది. తొలి రోజే తారకరత్న కు గుండెపోటుతో ఆసుపత్రి పాలవ్వడంతో మొదలుపెడితే లోకేష్ పాదయాత్రలో అపశ్రుతులు తక్కువేమీ కావు. వాటి సంగతలా ఉంటే.. ఈ పాదయాత్రకు జనాదరణ ఉండి ఉంటే, అన్నీ మరుగునపడిపోయేవి. ఎటొచ్చీ లోకేష్ పాదయాత్ర పేలవ రీతిలో సాగుతూ ఉండటంతో ఇతడి రాజకీయ భవితవ్యమే చర్చగా మారింది.
ఇప్పటికే లోకేష్ రాజకీయ వైఫల్యాలు చాలా ఉన్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదాతో మంత్రి అయిపోయి తనకు మించినోడు లేడని లోకేష్ అనుకోవచ్చు. చంద్రబాబు తనయుడు అనే ట్యాగ్ లేకపోతే లోకేష్ కు కనీసం వార్డు మెంబర్ గా పోటీ చేసేంత సీన్ కూడా లేదు. ఇక ఆయన మాట తీరు ఇప్పటికే పెద్ద కామెడీ. తెలుగు సినిమాకు సంబంధించిన కమేడియన్ల కామెడీ సీన్ల వీడియోలకు మించిన స్థాయిలో లోకేష్ ప్రసంగాలు వైరల్ గా ఉన్నాయి. ఇదంతా కొత్తగా చెప్పుకునేదేమీ కాదు!
మరి ఇదంతా తెలిసే.. ఆయన గతిని మార్చడానికి, ఆయననో పెద్ద నేతగా చూపించడానికి ఈ పాదయాత్రను మొదలుపెట్టారు. మరి అలాంటప్పుడు ఈ యాత్ర ఎలా మొదలవ్వాల్సింది? ఒక సంచలనం అనేంత స్థాయిలో! మరి దాని కోసం చాలా ప్లానింగ్ చేసినట్టుగానే ఉన్నారు. దీని కోసం లోకేష్ చేత థ్రెడ్ మిల్ పై నడిచే ప్రాక్టీస్ కూడా చేయించారట. రోజుకో పది కిలోమీటర్ల దూరం నడిచే ప్రాక్టీస్ చేయించి నెలల తరబడి ఈ పాదయాత్రకు ఆయనను ఫిట్ గా చేశారట. ఒక మాటల విషయంలో కూడా చాలా ప్రాక్టీస్ చేయించారని వార్తలు వచ్చాయి. పర్సనాలిటీ డెవలప్ మెంట్ ట్రైనర్లతో, ప్రముఖ రచయితలతో కూడా ఈ ట్రైనింగ్ సెషన్లు నడిచాయట. మరి ఇన్ని చేసినా మళ్లీ జనం 'మధ్యకు వచ్చి 'సైకిల్ పోవాలి…' అంటూ లోకేష్ మాట్లాడుతున్నారంటే తలపట్టుకోవాల్సింది చంద్రబాబు కాదు, తెలుగుదేశం వీరాభిమానులు, కార్యకర్తలే!
లోకేష్ పాదయాత్ర గురించి సమీక్షించుకునే తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగిందనే అంశం గురించి బోలెడంత విశ్లేషణ చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైన అంశాల్లో ఒకటి.. లోకేష్ పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంబించడం పొరపాటుగా చెప్పవచ్చు. అసలే కుప్పంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పేలవమైన రీతిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబును ఓడిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొడలు కొడుతోంది. ఇలాంటి నేపథ్యంలో… ఏరికోరి కుప్పంలో సత్తా చూపించాలంటూ అక్కడ నుంచి పాదయాత్రను మొదలుపెట్టించారు. తీరా అక్కడ జనాదరణ లేదు. కుప్పమే కాదు, చిత్తూరు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కానీ, రాయలసీమలోని ఇతర నియోజకవర్గాల్లో కానీ లోకేష్ పాదయాత్రకు ఇదే తరహా స్పందనే ఉండవచ్చు.
సీమలో తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడింది. ఇప్పటికీ పరిస్థితి మెరుగయ్యింది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో వేళ్లూనుకుంటోంది. బీసీ ఓటు బ్యాంకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన వైపుకు మళ్లించుకుంటోంది. దీనికి తోడు లోకేష్ కు ఉన్న ఇమేజ్ మరో ప్రతిబంధకంగా మారింది. పాదయాత్రలో ఆయన మాట తీరు చూస్తే తెలుగుదేశం వాళ్లే భయపడుతున్నారు! ఇలా చూస్తే మాత్రం కుప్పం నుంచినే కాదు.. ఎక్కడ నుంచి అయినా లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టనివ్వాల్సింది కాదేమో!