సురేందర్ ఏం తప్పు చేశాడు పవన్?

అడ్వాన్స్ తీసుకోవడం, కొబ్బరికాయ కొట్టడం.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్న పని ఇదే. కాల్షీట్లు ఎప్పుడు కేటాయిస్తామనేది తర్వాత, ముందు పూజ చేసేయాలి, సినిమా 'ఆన్' అయిందని అనిపించుకోవాలి. పార్ట్-పేమెంట్ తీసుకోవాలి. హరిహర వీరమల్లు…

అడ్వాన్స్ తీసుకోవడం, కొబ్బరికాయ కొట్టడం.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్న పని ఇదే. కాల్షీట్లు ఎప్పుడు కేటాయిస్తామనేది తర్వాత, ముందు పూజ చేసేయాలి, సినిమా 'ఆన్' అయిందని అనిపించుకోవాలి. పార్ట్-పేమెంట్ తీసుకోవాలి. హరిహర వీరమల్లు సినిమాకే టైమ్ కేటాయించలేకపోతున్న పవన్ కల్యాణ్.. సుజీత్, హరీశ్ శంకర్ సినిమాలతో పాటు, వినోదాయశితం రీమేక్ ను కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

మరి ఇదే ఊపులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను కూడా స్టార్ట్ చేయొచ్చు కదా? ఓ కొబ్బరికాయ కొట్టేస్తే ఆ సినిమా కూడా లైన్లోకి వచ్చేస్తుంది కదా..? మరి ఇంతమందికి కొబ్బరికాయలు పంచిన పవన్, సురేందర్ రెడ్డి సినిమాను మాత్రం లైట్ తీసుకున్నాడా..? దీని వెనక కారణం ఏంటి?

చాన్నాళ్ల కిందటే పవన్-సురేందర్ రెడ్డి కాంబోలో సినిమా ప్రకటన వచ్చింది. రామ్ తళ్లూరి నిర్మాతగా ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మాఫియా మూవీగా దీన్ని అప్పట్లో చెప్పుకున్నారు. యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు.

ఇంత జరిగిన తర్వాత ఆ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. కనీసం ముహూర్తం కూడా జరగలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి పవన్ కారణం కాదని తెలుస్తోంది.

ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టుకోమని నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట పవన్. ఓపెనింగ్ కు కూడా వస్తానని చెప్పాడట. కానీ నిర్మాతే వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ముహూర్తం షాట్ కొట్టినప్పటికీ, రెగ్యులర్ షూట్ మొదలవ్వడానికి చాలా టైమ్ పడుతుందనే విషయం రామ్ తళ్లూరికి తెలుసు. పైగా మిగతా నిర్మాతలతో పోలిస్తే, పవన్ పొలిటికల్ కార్యాచరణ ఏంటనేది తళ్లూరికి బాగా తెలుసు. అందుకే కాస్త వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

అటు సురేందర్ రెడ్డి కూడా ఏజెంట్ సినిమాను చెక్కుతున్నాడు. అతడు ఆ సినిమా నుంచి పూర్తిస్థాయిలో బయటకొచ్చిన తర్వాతే పవన్ సినిమాను పట్టాలెక్కించాలనేది నిర్మాత ఆలోచన. అందుకే ఈ సినిమా నెలల తరబడి లేట్ అవుతోంది. వీళ్లు రెడీ అయ్యే టైమ్ కు ఎన్నికలు తరుముకొస్తే, అప్పుడిక పవన్ ఎవ్వరికీ దొరకడు.