టీడీపీ లేస్తుంద‌నుకుంటే…పాద‌యాత్ర‌తో గోవిందా!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ పాద‌యాత్ర‌పై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌రసింహారావు సెటైర్స్ విసిరారు. అంతేకాదు, 400 రోజుల పాటు లోకేశ్ పాద‌యాత్ర చేయాల్సిందే అని ఆయ‌న డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.…

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ పాద‌యాత్ర‌పై బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌రసింహారావు సెటైర్స్ విసిరారు. అంతేకాదు, 400 రోజుల పాటు లోకేశ్ పాద‌యాత్ర చేయాల్సిందే అని ఆయ‌న డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, టీడీపీల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మూడో ప్ర‌త్యామ్నాయం తామే అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

రాష్ట్ర చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఉద్యోగుల‌కు జీతాలు ఎప్పుడిస్తారో తెలియ‌ని ద‌య‌నీయ స్థితి నెల‌కుంద‌న్నారు. దీనికి వైసీపీ ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించ‌డంతో పాటు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. వైసీపీ  ప్ర‌భు త్వాన్ని గ‌ద్దె దించాల‌ని ఏపీ ప్ర‌జానీకం మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారన్నారు. వైసీపీ ఎంపీలంతా అబద్ధాలు చెబుతూ, త‌మ చేతికాని త‌నాన్ని క‌ప్పి పెట్టుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. కేంద్రంపై బుర‌ద‌జ‌ల్లుదామ‌ని అనుకుంటే ఊరుకునేది లేద‌న్నారు.

వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న మాట వాస్త‌వం అన్నారు. కానీ గ‌తంలో ప‌రిపాలించిన టీడీపీ వైపు చూడాల‌న్న ఆస‌క్తి, ధైర్యం ఎవ‌రూ చేయ‌డం లేద‌న్నారు. ఆ ఐదేళ్ల పాల‌న ఎలా చేశారో అంద‌రూ చూశార‌న్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌రిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిలా త‌యారైంద‌న్నారు. వీరికి అధికారం ఇచ్చినా, వారిని తెచ్చినా ఇలాగే వుంటుంద‌ని జీవీఎల్ అన్నారు. ఈ ప్ర‌భుత్వాల్లో నిజాయ‌తీ లేద‌న్నారు. అలాగే సామాజిక న్యాయం అస‌లే లేద‌న్నారు.

వైసీపీ, టీడీపీల్లో సామాజిక న్యాయం, రాజ‌కీయ సాధికార‌త కేవ‌లం ఒక కుటుంబానికి, ఒక వ‌ర్గానికి మాత్ర‌మే అని ఆయ‌న విమ‌ర్శించారు. దీన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని జీవీఎల్  అన్నారు. అందుకే రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయం కావాల‌ని కోరుకుంటు న్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఆ ప్ర‌త్యామ్నాయం కేవ‌లం బీజేపీ, జ‌న‌సేన‌తోనే సాధ్య‌మ‌ని జీవీఎల్ తేల్చి చెప్పారు. టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే లోకేశ్ సీఎం అవుతార‌న్నారు. ఎవ‌రినో అధికారం పీఠంపై కూచోపెట్టేందుకు బీజేపీ సిద్ధంగా లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా త‌మ కూట‌మి అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

2024లో జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌న్నారు. ఎందుకంటే వైసీపీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోతోంద‌న్నారు. టీడీపీ లేచే ప‌రిస్థితి లేద‌న్నారు. టీడీపీ కొద్దిగా లేస్తుంద‌ని అనుకుంటే లోకేశ్ పాద‌యాత్ర ఆ పార్టీని స‌క్సెస్‌ఫుల్‌గా మ‌ళ్లీ వెనక్కి తీసుకెళ్లింద‌ని విమ‌ర్శించారు. కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 400 రోజులు పాద‌యాత్ర‌ను కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్నా మ‌న్నారు. లోకేశ్ పాద‌యాత్ర‌కు అడ్డంకులు సృష్టిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.