అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ వ్యక్తిగత, రాజకీయ అంశాలపై హోస్ట్ నందమూరి బాలకృష్ణ ప్రశ్నించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే పవన్‌కు బాలయ్య వేయాల్సిన ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరు తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరలేదనే బాలయ్య ప్రశ్నను పవన్ అసలు ఊహించలేదు. తనదైన గందరగోళ మనస్తత్వంతో ఆయన సమాధానం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పవన్‌కు బాలయ్య సంధించాల్సిన ప్రశ్నలివే అంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యక్షమయ్యాయి. “ఔను, లోకేశ్ పాదయాత్ర చేస్తుండగా, మళ్లీ మీరు వారాహి అంటూ వాహన యాత్ర చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? చంద్రబాబుకు లోకేశ్ కన్న కొడుకైతే, సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే మీరు దత్త పుత్రుడు కదా! మరెందుకు మీరు ప్రత్యేకంగా ప్రచార యాత్ర చేయాలని అనుకోవడం” అనే ప్రశ్న పవన్‌కు బాలయ్య వేసి వుంటే… సమాధానం ఏం చెప్పేవారో అనే చర్చ నడుస్తోంది.
అలాగే మీ కళ్లెదుట చంద్రబాబు లాంటి విజనరీ పొలిటీషియన్ ఉండగా, మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? సినిమాలు చేసుకుంటూ కోరుకున్నంత రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం వుండేది. రాజకీయాల్లోకి వచ్చిన పాపానికి ప్యాకేజీ తీసుకుంటున్న హీరో అనిపించుకోవడంపై మీ అభిప్రాయం? అని పవన్‌ను బాలయ్య ప్రశ్నిస్తే… జనసేనాని సమాధానం వినాలనే ఆసక్తి వుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
అలాగే గుంటూరు జిల్లా ఇప్పటం, విశాఖ ఎపిసోడ్‌ల గురించి పవన్‌ను బాలయ్య ప్రశ్నించి సమాధానాలు రాబట్టడాన్ని అభినందిస్తూనే, మిస్ అయిన వాటి గురించి బాలయ్యకు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఇదేం ఖర్మ సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది, అలాగే గుంటూరులో చీరల పంపిణీకి వచ్చి ముగ్గురు మృత్యువాత పడ్డారని, బాధితులను కాకుండా, విషాదానికి కారణమైన చంద్రబాబును పరామర్శించడం వెనుక ఉద్దేశం ఏంటని పవన్‌ను బాలయ్య ప్రశ్నించి వుంటే… అన్‌స్టాపబుల్ టాక్ షోకు నిండుదనం వచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏం బాలయ్యా…పవన్‌ను ప్రశ్నించకుండా మిగిలిపోయిన వాటితో మరొక ఎపిసోడ్‌కు ప్లాన్ చేయకూడదా? అనే ఉచిత సలహాలు వెల్లువెత్తుతున్నాయి.