స్కూల్ బ్యాగ్స్ లో డ్రగ్స్.. కొరియర్లుగా పిల్లలు

కొన్ని నెలల కిందటి సంగతి.. తిరువనంతపురంలో ఓ లాడ్జి నుంచి ఓ స్కూల్ విద్యార్థిని బయటకు వచ్చి బిగ్గరగా అరుస్తూ నానా హంగామా చేసింది. అప్పటికే ఆమె డ్రగ్స్ తీసుకొని ఉంది. ఆ వీడియో…

కొన్ని నెలల కిందటి సంగతి.. తిరువనంతపురంలో ఓ లాడ్జి నుంచి ఓ స్కూల్ విద్యార్థిని బయటకు వచ్చి బిగ్గరగా అరుస్తూ నానా హంగామా చేసింది. అప్పటికే ఆమె డ్రగ్స్ తీసుకొని ఉంది. ఆ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన కేరళ ప్రభుత్వం, ఆ అమ్మాయి క్లాసులో చాలా చురుకైన పిల్ల అని, ఆమెను గంజాయికి బానిసగా మార్చి, కొరియర్ గా వాడుకుంటున్నారని తెలుసుకుంది.

తీగ లాగితే డొంక కదిలినట్టు.. కేరళలోని చాలా పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగం జోరుగా సాగుతోందనే విషయాన్ని తెలుసుకొని కేరళ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా కేరళ పోలీసులు నిర్వహించిన సర్వేలో.. 21 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువగా మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారని, వీళ్లలో 18 ఏళ్ల లోపు వయసున్న వాళ్లు 40శాతంమంది ఉన్నారని తేలింది. మరింత భయంకరమైన విషయం ఏంటంటే.. ఇలా మాదకద్రవ్యాలు సేవిస్తున్న వాళ్లలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు.

అమ్మాయిలపై ఇదో రకం అఘాయిత్యం..

మంచిగా పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత తమ కామవాంఛను తీర్చుకునేందుకు మత్తుమందును అలవాటు చేస్తారు. ఆ తర్వాత అదే మత్తుకు వాళ్లను బానిసల్ని చేస్తారు. ఆ తర్వాత అలా డ్రగ్స్ కు బానిసలైన అమ్మాయిలతో ఏకంగా డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నారు. కాదు, కూడదు అంటే నగ్న వీడియోలతో బెదిరింపులకు దిగుతున్నారు.

అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్, మాదకద్రవ్య ముఠాలతో కుమ్మక్కై ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల చుట్టుపక్కలున్న 18వేలకు పైగా షాపుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ షాపుల నుంచే సరఫరా జరుగుతోందని గుర్తించి, 462 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు.

స్కూల్స్ తర్వాత ట్యూషన్ సెంటర్లు..

పాఠశాలలపై నిఘా పెరిగిందని గమనించిన డ్రగ్స్ వ్యాపారులు, ట్యూషన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటికే బానిసలైన బాలికలు ఏ ట్యూషన్ సెంటర్ కు వెళ్తున్నారో తెలుసుకొని, అక్కడ్నుంచి వాళ్లను కొరియర్స్ గా వాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు పసిగట్టారు.

2022లో కేరళ పోలీసులు 25,240 కేసులు నమోదు చేసి 29,514 మంది నిందితులను అరెస్టు చేశారు, 2021లో ఇలా అరెస్టైన నిందుతుల సంఖ్య 6704 మాత్రమే. ఏడాదిలో మాదకద్రవ్యాల సరఫరా ఏ స్థాయికి చేరుకుందో ఈ నంబర్లు చూస్తే అర్థమౌతుంది.

తల్లిదండ్రుల పాత్రే ముఖ్యం..

మొన్నటివరకు పంజాబ్ రాష్ట్రం ఈ సమస్యతో బాధపడింది. ఇప్పుడు కేరళ విలవిల్లాడుతోంది. పంజాబ్ లో పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేరళలో పోలీసు చర్యలు సఫలమవ్వాలంటే తల్లిదండ్రులంతా జాగృతం కావాలని అంటున్నారు ఛైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు.

పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వాళ్లలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి లాంటి విషయాల్ని ఎప్పటికప్పుడు గమనించాలని.. పిల్లల స్కూల్ బ్యాగ్స్ ను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని చెబుతున్నారు. వీటితో పాటు పిల్లల స్నేహితులు ఎవరు, ఎవరితో వాళ్లు ఎక్కువ సమయం గడుపుతున్నారు, పిల్లలు ఇంటికొచ్చే దారిలో ఎలాంటి పరిస్థితులున్నాయనే అంశాలపై కూడా తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.