ఆంధ్ర రాజకీయాలు ఏం జరుగుతున్నాయి? చాలా కాలంగా రాజకీయ పరిశీలకులను తొలిచేస్తున్న సమస్య ఏమిటంటే తెలుగుదేశం-జనసేన-భాజపా పొత్తు సాధ్యం అవుతుందా? అనేదే? అసలు జనసేనను తేదేపా వైపు వెళ్లనిస్తుందా భాజపా అన్నది ఇంకో అనుమానం. కానీ భాజపాతో సంబంధం లేదు..తన ఎజెండా తనది అంటూ తేదేపా వైపు వెళ్లే స్కీమును మొహమాటం లేకుండా వెల్లడించారు పవన్ కళ్యాణ్. మరీ అంత ఓపెన్ గా ఎలా చెప్పారా? అన్నది మరో అనుమానం.
కేవలం జనసేన వస్తే చాలదు, భాజపాతో కలిసి వస్తేనే బెటర్ అనేది తేదేపా మనోగతం. వైకాపాతో మంచి సంబంధాలున్న భాజపా అలా ఎలా వస్తుందన్నది ఇంకో అనుమానం. ఇన్ని లెక్కలు, ఈక్వేషన్లు, అనుమానాలు, ఆలోచనల నడుమ ఆంధ్ర రాజకీయం మెలమెల్లగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
భాజపా-వైకాపా సంబంధాలు మెల్లమెల్లగా మార్పుకు గురవుతున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు ఆ దిశగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఇప్పటి వరకు జగన్ కు అండగా వుంటూ వస్తున్న కేంద్ర భాజపా ప్రభుత్వం ఇక మొహం చాటేసి, ప్లేట్ మారుస్తుందా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. వరుసగా జరుగుతున్న పరిణామాలు, కేంద్రం చేస్తున్న ప్రకటనలు ఇందుకు కారణం అవుతున్నాయి.
అవకాశం దొరికినపుడల్లా కేంద్రం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రకటనలు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కావచ్చు, రాజధాని మీద కావచ్చు, అవకాశం దొరికినపుడల్లా చేసే ప్రకటనలు తెలుగుదేశం పార్టీకి వైకాపా మీద విమర్శలు చేసే చాన్స్ ఇస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలు కూడా ఇలాగే వున్నాయి. ఇక లిక్కర్ కుంభకోణం కూడా ఇదే దారిలో వెళ్తోంది. తెలంగాణ సిఎమ్ కూతురు కవితను చుట్టుకుంటుందని అందరూ భావించిన ఈ కేసు వైకాపా ఎంపీలను చుట్టుకుంటోంది. మోడీకి ఎదురుతిరిగి ఢీ కొడుతున్న తెరాసను టచ్ చేయడం లేదు.
ఇక లేటెస్ట్ గా గవర్నర్ ను కూడా మార్చారు. నిజానికి మార్చాల్సిన పరిస్థితి లేదు. తెలంగాణలో గవర్నర్ కు అక్కడి ప్రభుత్వానికి పోటా పోటీ వుంది. కలహిస్తున్నారు. కలుస్తున్నారు. కానీ ఆంధ్రలో మాత్రం గవర్నర్ వైకాపాకు పూర్తి అనుకూలంగా వున్నారు. అలాంటిది ఉన్నట్లుండి మార్చేసారు. కాస్త స్టబర్న్ అని పేరు తెచ్చుకున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిని తీసుకువచ్చారు. ఇప్పుడు వ్యవహారాలు ఎలా వుంటాయో చూడాలి.
మొత్తం మీద ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు అన్నట్లుగా జరుగుతన్న సంఘటనలు అన్నీ వైకాపా విషయంలో భాజపా వైఖరి మారుతోందా? అన్న అనుమానాలను అయితే మెలమెల్లగా కలిగిస్తున్నాయి. ఈ అనుమానాల మీద ఫుల్ క్లారిటీ వచ్చి, ఎస్ ఆర్ నో అనేది తెలియడానికి ఇక ఎన్నో రోజులు పట్టకపోవచ్చు.