కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల నియామకం, బదిలీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 12 మంది గవర్నర్ల మార్పునకు శ్రీకారం చుట్టింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఛత్తీస్‌ఘడ్‌కు మార్చి, ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అబ్దుల్ నజీర్‌ను కేంద్రం నియమించింది. అయితే నిత్యం వివాదానికి కారణమైన తెలంగాణ గవర్నర్ తమిళసైని మాత్రం కదపకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల గవర్నర్ విషయమై కేసీఆర్ సర్కార్ చివరికి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇందులో తప్పొప్పుల గురించి పక్కన పెడితే, వ్యవహారం న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకూ వెళ్లిందన్నది వాస్తవం. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించాలని అనుకుని, చివరికి ఒక మెట్టు కేసీఆర్ దిగింది. దీంతో సమస్య లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం వెనుక వ్యూహం వుంటుందనే చర్చకు తెరలేచింది. ఈ ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీతో పాటు గవర్నర్ కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. కేసీఆర్ సర్కార్‌పై రాజకీయ విమర్శలు చేయడంతో పాటు మోదీ సర్కార్‌ను వెనకేసుకు రావడానికి గవర్నర్ తమిళిసై ఏ మాత్రం భయపడడం లేదు.
దీంతో ఎన్నికల సంవత్సరంలో తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా కొనసాగడం రాజకీయంగా లాభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందుకే కేసీఆర్ సర్కార్ వర్సెస్ తమిళిసై అన్నట్టు వివాదం నడుస్తున్నా, దాన్ని సద్దుమణచడానికి బదులు, మరింత ఎగదోలాలనే ఆలోచనలో బీజేపీ వుంది. అందుకే తెలంగాణ గవర్నర్‌ను కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది.
తనను కొనసాగించిన నేపథ్యంలో …వివాదాన్ని కొనసాగించాలనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఆమె అర్థం చేసుకునే అవకాశం వుంది. దీంతో రానున్న రోజుల్లో కేసీఆర్ సర్కార్‌తో గవర్నర్ కయ్యానికి కాలు దువ్వే అవకాశాలే ఎక్కువని చెప్పక తప్పదు.