ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దేశ వ్యాప్తంగా 12 మంది గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కాన్ని కేంద్ర…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దేశ వ్యాప్తంగా 12 మంది గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా చేప‌ట్టింది. ఇందులో ఏపీ కూడా ఉండ‌డం విశేషం.

ఇంత కాలం ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను ఛ‌త్తీస్‌ఘ‌డ్ గ‌వ‌ర్న‌ర్‌గా బ‌దిలీ చేశారు. ఇదిలా వుండ‌గా నూత‌న గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ మ‌న పొరుగు రాష్ట్ర‌మైన క‌ర్నాట‌క నివాసే. అయోధ్య‌పై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు చెప్పిన ఐదుగురున్న బెంచ్‌లో న‌జీర్ ఒక‌రు. అలాగే ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బెంచ్‌లో నజీర్ ఏకైక ముస్లిం న్యాయమూర్తి.

అబ్దుల్ న‌జీర్ 1983లో న్యాయ‌వాదిగా క‌ర్నాట‌క హైకోర్టులో ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. 2003లో క‌ర్నాట‌క హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. అనంత‌ర కాలంలో అదే హైకోర్టు న్యాయ‌మూర్తిగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిం చారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి పొందారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 4న అబ్దుల్ న‌జీర్ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు.

గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ విష‌యానికి వ‌స్తే ఒరిస్సాకు చెందిన వ్య‌క్తి. ఈయ‌న వృత్తిరీత్యా న్యాయ‌వాది. బీజేపీతో అనుబంధం ఉన్న నాయకుడు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కాకుండా ప్ర‌తిప‌క్షాలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌తో నిత్యం వివాదాలు. ప‌శ్చిమ‌బెంగాల్‌, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ త‌దిత‌ర రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌తో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వాల ఫైట్ గురించి తెలిసిందే. కానీ ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధ‌మైన ప‌రిస్థితి. గ‌వ‌ర్న‌ర్ బ‌దిలీ ఏపీ స‌ర్కార్‌కు చిన్న‌పాటి షాక్ అని చెప్పొచ్చు.