ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అధికారం శాశ్వతం కాదు. తాము కోరుకున్నట్టు పాలన లేదని ప్రజలు అనుకుంటే…ఐదేళ్ల తర్వాత ఇంటికి సాగనంపుతుంటారు. ఎంతటి కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులైనా ప్రజల ముందు మోకరిల్లాల్సిందే.
ప్రజల ఆశీస్సులు లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను దేవుళ్లతో సమానంగా అభివర్ణిస్తుంటారు. అదేంటో గానీ, 23 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లు మాత్రమే ఇచ్చినా, కనీసం పశ్చాత్తాపం టీడీపీ నేతల్లో లేదు. 2019 ప్రజాతీర్పుపై టీడీపీకి ఎంత చులకన భావం వుందో నారా లోకేశ్ మాటలే నిదర్శనం.
పాదయాత్రలో లోకేశ్ మాట్లాడుతూ…. ‘2019 ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ కాదు, రాష్ట్ర ప్రజలు’ అని అన్నారు. ఇదే టీడీపీకి అధికారాన్ని కట్టబెడితే మాత్రం… ఆ పార్టీ గెలిచినట్టుగా చెబుతారు. ప్రజల చైతన్యంపై టీడీపీకి ఎంత చిన్న చూపు ఉందో లోకేశ్ మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ప్రజాతీర్పును గౌరవించని వారు, ఇక ప్రజలను ఏ విధంగా ప్రేమిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలి. ఓటమిని గెలుపుగా మలుచుకునేందుకు నిత్యం ప్రజల్లో వుండాలి. 2019 ఎన్నికల్లో ప్రజలు ఓడిపోయారనే భావన మనసులో పెట్టుకుని లోకేశ్ పాదయాత్ర ఎలా చేస్తున్నారనే నిల దీతలు ఎదురవుతున్నాయి. టీడీపీ ఓడిపోకపోతే, మంగళగిరిలో తన పరిస్థితి ఏంటో లోకేశ్ చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ ఓడిపోలేదనే ఆలోచన మనసులో ఉంటే, ఇక పాదయాత్ర చేయడం ఎందుకని ప్రశ్నించే వాళ్లకు లోకేశ్ సమాధానం ఏంటి? అధికారంపై ప్రేమ తప్ప, ప్రజలపై ఎంత మాత్రం కాదని తాజా లోకేశ్ అహంకార పూరిత మాటలే నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇలాంటి మాటలతో టీడీపీకి మరింత డ్యామేజీ తప్పదనే హెచ్చరిక చేస్తున్నారు.