త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలను మినహాయిస్తే, మిగిలిన 9 స్థానిక సంస్థలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి వుంది. రాయలసీమతో పాటు ఉభయగోదావరి జిల్లాలో స్థానిక సంస్థలకు అభ్యర్థుల ఎంపిక అధికార పార్టీకి సవాల్‌గా మారింది. అన్ని చోట్ల వైసీపీనే తిరుగులేని గెలుపు సాధిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొందరు వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారనే ప్రచారం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది. ఇలాగైనా వారిని పార్టీలోనే కొనసాగేలా చేసుకునేందుకు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగన్ సీటు ఇస్తారనే ఆశ, ఆలోచన వుందని సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నాయకుడు టీడీపీలో చేరుతారనే ప్రచారం వెనుక ఇలాంటి వ్యూహమే ఉందని తెలిసింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత రాజకీయంగా పెద్దగా యాక్టీవ్‌గా లేరు.
అయితే స్వభావ రీత్యా ఆయన వ్యవహార శైలే అలాంటిదని చెబుతున్నారు. వైసీపీ అధిష్టానం దృష్టి ఆకర్షించేందుకు సదరు నాయకుడి అనుచరులు పార్టీ మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. నిజానికి టీడీపీ నాయకుడు బీసీ జనార్ధన్‌రెడ్డితో ఆ వైసీపీ నాయకుడికి బంధుత్వం వుందన్న మాటే తప్ప, సన్నిహిత సంబంధాలు లేవని తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి ఆయనను బీసీ రానివ్వరని సమాచారం.
ఇదే రకమైన వ్యూహాలను ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు కూడా వేసుకున్నట్టు తెలిసింది. ఒకవేళ తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వకపోతే టీడీపీలోకి వెళ్తామని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్టు సమాచారం. వ్యూహాలన్నీ ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.