పర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ఏప్రిల్‌లో జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు జనసేనాని పవన్‌కల్యాణ్‌తో ఆయన మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఆమంచి సోదరుల మధ్య కొంత కాలంగా గ్యాప్ వుంది. దీంతో రాజకీయంగా వేర్వేరు దారులు చూసుకున్నారు. చీరాలలో ఆమంచి కుటుంబానికి మంచి పట్టు వుంది. అయితే రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇన్‌చార్జ్‌గా సీఎం జగన్ నియమించారు.
2014లో చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ చేతిలో ఓడిపోయారు. చీరాల నుంచి టీడీపీ తరపున గెలుపొందిన కరణం బలరాం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. బలరాం కుమారుడు వెంకటేశ్‌ను చీరాల వైసీపీ ఇన్‌చార్జ్‌గా జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు తానున్నానంటూ తెరపైకి వచ్చారు.
పవన్‌కల్యాణ్‌తో పాటు స్వాములు ఫొటో ఉన్న ప్లెక్సీలు చీరాల ప్రధాన రహదారుల్లో దర్శనమిస్తున్నాయి. దీంతో జనసేనలో స్వాములు చేరనున్నారనే ప్రచారానికి తెరలేచింది. ఏప్రిల్‌లో జనసేనలో ఆమంచి సోదరుడు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే స్వాములు వ్యూహం వేరే వుంది. టీడీపీతో జనసేన పొత్తులో భాగంగా చీరాల లేదా గిద్దలూరులో ఏదో ఒక టికెట్‌ను స్వాములు ఆశిస్తున్నారు. కానీ పొత్తులో భాగంగా స్వాములకు టికెట్ ఇచ్చే ప్రశ్నే లేదని ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
స్వాములు ఎత్తుగడను కనుక్కోలేని దయనీయ స్థితిలో తాము లేమని టీడీపీ నేతలు అంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చీరాలలో జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థికి కేవలం 2,470 ఓట్లు మాత్రమే వచ్చాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆమంచి సోదరులు చెరో పార్టీలో వుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే కుదరదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పల్లకీ మోయడానికి మాత్రమే జనసేనలో ఆమంచి సోదరుడు చేరుతారా? అనేది జవాబు చెప్పాల్సిన ప్రశ్న.