నారా లోకేశ్ ఏ లక్ష్యంతో పాదయాత్ర మొదలు పెట్టారో తెలియదు కానీ, ఆయన తీరు చూస్తుంటే రౌడీ కావడం పక్కా అని చెప్పొచ్చు. కుప్పంలో పడిన తొలి అడుగు…శనివారానికి 200 కి.మీ చేరుకుంది. నడక లోకేశ్‌ను నాయకుడిగా తీర్చిదిద్దుతుందని టీడీపీ ఆశించింది. కానీ లోకేశ్ నడత ఏం బాగోలేదనే అభిప్రాయాల్ని కలిగిస్తోంది. ఇదే రీతిలో ఆయన పాదయాత్ర సాగితే మాత్రం… లీడర్ కావడం దేవుడెరుగు, రౌడీ మాత్రం తప్పక అవుతారు.
పాదయాత్రలో భాగంగా మాట్లాడుతున్న లోకేశ్ మైక్‌ను పోలీసులు లాక్కున్నారు. దీన్నెవరూ సమర్థించరు. ఇలాంటి చర్యలతో లోకేశ్ పాదయాత్రకు మరింత ప్రచారం తీసుకురావడం తప్ప, టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదు. ఈ విషయం తెలిసి కూడా పోలీసులు మైక్ లాక్కున్నారంటే… పాదయాత్రను విజయవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారని అర్థం చేసుకోవాలి. తన మైక్‌ను పోలీసులు లాక్కుంటే… లోకేశ్ మాత్రం సీఎం జగన్‌పై చెలరేగిపోయారు.
మాటకు ముందు, తర్వాత “రేయ్” అంటూ జగన్‌పై తిట్ల పురాణానికి దిగడం టీడీపీ శ్రేణుల్ని సైతం నివ్వెరపరిచింది. జగన్‌ను తిట్టడం వల్ల లోకేశ్‌కు కలిగే రాజకీయ ప్రయోజనం ఏంటో అర్థం కావడం లేదు. తన చుట్టూ ఉన్న కార్యకర్తలు ఆనందంతో చప్పట్లు కొట్టొచ్చు. ఈలలు వేయొచ్చు. టీడీపీ శ్రేణుల్ని సంతోషపెట్టేందుకే జగన్‌పై అభ్యంతరకర భాష ప్రయోగించానని లోకేశ్ అనుకోవచ్చు.
కానీ తనను కోట్లాది మంది ప్రజానీకం గమనిస్తోందని లోకేశ్ గుర్తు పెట్టుకోవాలి. లీడర్ కావాలని కోరుకునే వారెవరూ ఇలాంటి అభ్యంతరకర, సంస్కార హీనమైన భాషను ప్రయోగించరు. బూతులు మాట్లాడే నాయకులే తనకు ఆదర్శమైతే… లోకేశ్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. పతనమవుతున్న రాజకీయ విలువలకు అలాంటి వారిని ఉదాహరణగా చెప్పుకుంటాం. ఆ జాబితాలో చేరేందుకే పాదయాత్ర చేపట్టి వుంటే లోకేశ్‌ను ఎవరూ మార్చలేరు.
తనకు తానుగా రాజకీయ సమాధి కట్టుకోవాలని తలిస్తే… ఇదే కుసంస్కార భాషను లోకేశ్ యథేచ్ఛగా వాడొచ్చు. జగన్‌పై బూతులు ప్రయోగిస్తూ… పాదయాత్ర కొనసాగిస్తే, చివరికి రౌడీ, చిల్లర నాయకుడిగా జనం గుర్తించడం ఖాయం. తన భవిష్యత్ మాటలో వుందని ఇప్పటికైనా లోకేశ్ గ్రహించి నడుచుకోవాల్సి వుంది.