కళాతపస్వి కె విశ్వనాధ్ మరలిరాని లోకాలకు తరలి వెళ్లిపోయి రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకు ఓ సరైన సంతాప కార్యక్రమం లేదా ఆ పెద్దాయిన సినిమాలను, వాటి మంచి చెడ్డలను తలచుకునే సభ పెట్టే తీరుబాటు మాత్రం టాలీవుడ్ లో ఎవ్వరికీ లేదు. ముఖ్యంగా దర్శకుల సంఘం అనేది ఒకటి వుంది. దానికీ పట్టినట్లు కనిపించడం లేదు.
ప్రభుత్వాల వైపు నుంచి కే విశ్వనాధ్ కు దక్కాల్సిన గౌరవాలు దక్కలేదనే బాధ అభిమానులకు వుండనే వుంది. అది ఎవరి చేతుల్లో వున్న వ్యవహారం కాదు. అందువల్ల కనీసం సినిమా ఇండస్ట్రీ చేతుల్లో వున్న వ్యవహారం అయినా సజావుగా జరిపించి వుంటే వేరుగా వుండేది.
కే విశ్వనాధ్ లాంటి దర్శకుడు మరణిస్తే ఓ సరైన సంతాప సభ పెట్టలేని స్థితిలో టాలీవుడ్ వుందీ అంటే దారుణమైన విషయమే. దర్శకుల సంఘం, కౌన్సిల్, ఛాంబర్ ఇలాంటి సంఘాలు అన్నీ కలిసి ఓ సరైన సంతాప కార్యక్రమం నిర్వహించి వుండాల్సింది. అదే కనుక ఏ నిర్మాత లేదా దర్శకుడు అభిమానంతో ముందుకు వచ్చి, ఎంత ఖర్చు అవతుంది తాము భరిస్తాం అంటే మాత్రం చేయడానికి చాలా మందే ముందుకు వస్తారు.
ఇలాంటి సమయంలోనే టాలీవుడ్ లో వున్న సంకుచిత భావనలు, రాజకీయాలు అన్నీ జనాలకు తెలిసి వస్తాయి. చనిపోయిన వారి పిల్లలు లేదా బంధుగణం మంచి పొజిషన్ లో వుంటే టాలీవుడ్ జనాలు ఉరుకులు పరుగులు పెడతారు. నీరాజనాలు అర్పిస్తారు. లేదూ అంటే అస్సలు పట్టించుకోరు. లేదా కనీసం కులం, గోత్రం వంటి వ్యవహారాలు కలిసి రావాలి. లేదూ అంటే అసలే పట్టదు.
ఇవన్నీ విమర్శలు కావు. ఫేస్ బుక్ ల్లాంటి సోషల్ మీడియాలో హోరెత్తుతున్న విషయాలు. జనాలకు టాలీవుడ్ వ్యవహారం తెలియదు అని అనుకోవడానికి లేదు. మీడియా పట్టించుకోకుండా సోషల్ మీడియా లో జనాలు వారి వారి భావాలు, పదును విమర్శలు చేస్తూనే వున్నారు. కానీ ఆఫ్ కోర్స్..అవన్నీ టాలీవుడ్ జనాలు పట్టించుకోరనుకోండి.అది వేరే సంగతి.