జనంకి ఒక బలహీనత వుంది. వాళ్లు బలహీనుల పట్ల సానుభూతితో వుంటారు. ఒక వ్యక్తిని అనవసరంగా వేధిస్తే సహించలేరు. జగన్‌పై కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపారనే కోపంతోనే వైసీపీకి ప్రాణం పోశారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని పెకలించి వేసారు. ఏళ్ల తరబడి జనంలో యాత్రలు చేస్తున్న జగన్‌పై పని చేసిన సానుభూతి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. ఇది గతం. ప్రస్తుతానికి వద్దాం.
లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడు. జగన్ మీద వ్యతిరేకతతో జనం ప్రభంజనంలా వస్తారని టీడీపీ అంచనా వేసింది. అదేం జరగలేదు. లోకేశ్‌కి ప్రజాకర్షణ లేకపోవడం, పాదయాత్రలపై జనానికి ఆసక్తి లేకపోవడం, టీడీపీ నిర్వహణ వైఫల్యం కారణాలు ఏవైనా కావచ్చు. పాదయాత్రకి అనుకున్నంత స్పందన లేదు. టీడీపీ అనుకూల మీడియా ఒక మోస్తారుగా కవర్ చేస్తోంది తప్ప చొక్కాలు చించుకోవడం లేదు. సాక్షి జగన్ సొంత పత్రిక కాబట్టి పేజీలకి పేజీలు వేయగలిగారు. లోకేశ్‌ను అంత లేపే పరిస్థితి అనుకూల మీడియాకి కూడా లేదు. సాక్షి పత్రిక , చానల్‌లో అయితే లోకేశ్ యాత్రకి జనం లేరనే వార్తలు వస్తున్నాయి.
సాక్షి నిజాలే రాస్తోందని అనుకున్నాం. మరి జనం లేని యాత్రకి పోలీసులతో అడ్డంకులు సృష్టించడం ఎందుకు? మైక్ లాక్కోవడం, స్టూల్ లాగడం ఇవన్నీ అవసరమా? లోకేశ్ మాట్లాడితే వైసీపీకి అంత నష్టం జరుగుతుందా? లోకేశ్ వల్ల నష్టపోయి, తలకిందులయ్యే పార్టీ కూడా ఒక పార్టీయేనా? అడ్డంకులు సృష్టించే కొద్ది లోకేశ్ ఎంతోకొంత బలపడతాడు. ప్రభుత్వం దగ్గరుండి, పోలీసులను పెట్టి మరీ లోకేశ్ మైలేజీ పెంచుతోంది. వదిలేస్తే అతనే మెల్లిగా వీక్ అయిపోయి, పాదయాత్ర ఉన్నట్టే జనానికి గుర్తు లేకుండా పోతుంది.
చరిత్ర నుంచి జగన్ పాఠాలు నేర్చుకోవాలి. రాజ్‌నారాయణ్ లాంటి (1971) అర్బకుడి కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించి ఓడించిన ఇందిరాగాంధీ 1977లో అదే రాజ్‌నారాయణ్ చేతిలో ఓడిపోయారు. చాణిక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబే తన కొడుకుని లీడర్ చేయలేకపోయాడు. బాబు చేయలేని పనిని అనాలోచిత చర్యలతో జగన్ చేసేలా వున్నాడు.