అవును టీవీల్లోనూ, పత్రికల్లోనూ మనం చూస్తున్నది, చదువుతున్నది…అంతా ఉత్తుత్తిదే. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, వైఎస్ జగన్ పరస్పరం దూషించుకున్నది కూడా అబద్ధమేనట. “నువ్వు మగాడివైతే, రాయలసీమ పౌరుషం ఉంటే” అని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఓ మంత్రిగా అచ్చెన్నాయుడు అవహేళన చేయడం ప్రతి ఒక్కరం చూసి అసహ్యించుకున్నాం.
అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ “అచ్చెన్నాయుడు పర్సనాలిటీ (ఫిజిక్) పెరిగితే సరిపోదు…కాస్త బుర్ర పెంచుకో” అని హావభావాలతో మాజీ మంత్రిని ఎద్దేవ చేయడాన్ని చూసి దెబ్బకు దెబ్బ అని చర్చించుకున్నాం. ఇలా అనేక సందర్భాల్లో గత ఐదేళ్లుగా అసెంబ్లీతో పాటు బయట అనేక వేదికల్లో వారిద్దరూ పరస్పరం వ్యక్తిగతంగా తిట్టుకోవడాన్ని విన్నాం, చూశాం.
ప్రస్తుతానికి వస్తే శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి విధివిధానాలను నిర్ణయించేందుకు బీఏసీ (బిజినెస్ అడ్వేజరీ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్చెన్నా అని జగన్ అంటే, జగనన్నా అని అచ్చెన్నాయుడు అంతే మర్యాదతో సంబోధించడం ఆసక్తి కలిగిచింది.
టీడీపీ శాసనసభా ఉపనేత అచ్చెన్నాయుడు ఇటీవల కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయమై సమావేశంలో అచ్చెన్నాయుడి యోగక్షేమాల గురించి జగన్ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నాడు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో ఎలా బయటపడ్డాడో అచ్చెన్న వివరించాడు.
ఇదే సమయంలో వారి మధ్య సాగుతున్న స్నేహపూర్వక సంభాషణలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నాడు.
“అచ్చెన్నా చూశావా మా సీఎంకు మీపై ఎంత ప్రేమో” అని సరదాగా అన్నాడు. “నాకు మాత్రం సీఎం గారంటే ప్రేమ లేదా? ఆయనపై నాకు కోపమెందుకు? మా మధ్య వ్యక్తిగత గొడవలేమీ లేవు. ఇద్దరి పార్టీలు వేరంతే” అని అచ్చెన్నాయుడు హూందాగా సమాధానం ఇచ్చాడని తెలిసింది.
ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో “నాయకులంతా ఒక్కటే. మధ్యలో ప్రజలే రెచ్చిపోతూ అమాయకంగా వర్గాలుగా విడిపోతున్నారనే” అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.