యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రవేశానికి అంతా రెడీ అయిపోతోంది. డైరక్ట్ బాలీవుడ్ సినిమా కాకుండా, తెలుగు సినిమానే హిందీలో కూడా రూపొందించే పని స్టార్ట్ చేసారు.
పూరి జగన్నాధ్ డైరక్షన్ లో తయారు కాబోయే ఫైటర్ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేసేందుకు నిర్మాత కమ్ దర్శకుడు పూరి జగన్నాధ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ తో గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. వారిద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది.
బాహుబలి సినిమాను పంపిణీ చేసినట్లే ఫైటర్ సినిమాను కూడా బాలీవుడ్ లో కరణ్ జోహార్ ప్రమోట్ చేసి, పంపిణీ చేస్తారు. ఈ మేరకు నిర్మాణానికి ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. బాలీవుడ్ ఎంట్రీకి అనుగుణంగా స్క్రిప్ట్ ను ట్యూన్ చేసే బాద్యత పూరి జగన్నాధ్ దే. ఈ మేరకు స్టార్ కాస్ట్ లో కూడా చిన్న చిన్న మార్పులు వుండే అవకాశం వుంది.
గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ మీద కన్నేసారు. బాలీవుడ్ తారలు కూడా విజయ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైటర్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా మార్చడం అంటే పూరి జగన్నాధ్ కు పంట పండినట్లే అనుకోవాలి.