దిశ హత్య కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలు మరికొన్ని రోజుల పాటు మార్చురీలో ఉండబోతున్నాయి. ఈ మేరకు హైకోర్టు ఈరోజు మరో ఆదేశం జారీచేసింది. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో ఈరోజు రాత్రి 8 గంటల వరకు మృతదేహాల్ని ఉంచాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు.. ఆ నాలుగు డెడ్ బాడీస్ ను శుక్రవారం వరకు భద్రపరచాలని ఆదేశించింది. అయితే ఈసారి మహబూబ్ నగర్ కాకుండా గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించింది.
ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి ఇప్పటికే జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగింది. నిన్నంతా మృతుల కుటుంబాలను ప్రశ్నించింది. దిశ తల్లిదండ్రులతో పాటు ఎన్ కౌంటర్ అయిన నలుగురు వ్యక్తుల కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించింది. వాళ్లందర్నీ హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీకి ప్రత్యేకంగా రప్పించారు. అలా తమ విచారణలో ఒక దశను పూర్తిచేసిన ఏడుగురు సభ్యుల కమిషన్, ఈ రోజు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులతో పాటు మరికొంతమంది ఉన్నతాధికారుల్ని ప్రశ్నించింది.
ఈ కేసుకు సంబంధించి రేపు ఫోరెన్సిక్ నివేదిక రానుంది. అది వచ్చిన తర్వాత ఎన్ కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఫోరెన్సిక్ నివేదికను నేరుగా కమిషన్ కు ఇవ్వాలా లేక హైకోర్టుకు నివేదించాలా అనే విషయంపై ఇంకా సందిగ్దత తొలగలేదు. ఈ నివేదిక వచ్చిన తర్వాతే మృతదేహాల్ని బంధువులకు అప్పగిస్తారు.
మరోవైపు ఈ ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ ఎన్ కౌంటర్ పై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, తమకు చాలా అనుమానాలున్నాయంటూ ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వాజ్యం) వేశారు. దీనిపై ఎల్లుండి విచారణ ప్రారంభమౌతుంది.