ఫండింగ్ రావాలి అంటే ఏదో ఒకటి చేయాలి. లేదా ఏదో ఒక ఆశ వుండాలి. ఓ పెద్ద ప్రొడక్షన్ హవుస్ ఇప్పుడు కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. చేతిలో వున్న సినిమా మీద కాస్త గట్టిగానే ఖర్చు పెట్టేసారు. కానీ అది కనీసం పది శాతం కూడా పూర్తి కాలేదు. ఆ సినిమా పూర్తయితే తప్ప, సమస్యలు గట్టెక్కవు. ఆ సినిమా పూర్తికావాలి అంటే కనీసం ఓ యాభై కోట్లు అన్నా కావాలి.
అందుకే ఇప్పుడు అలా ఫండింగ్ చేసే వారి కోసం వెదుకుతోంది ఆ సంస్థ అని బోగట్టా. అయితే ఆలా ఎవరైనా ఫండింగ్ ఇస్తే, వారికి తమకు సన్నిహిత బాంధవ్యాలున్న ఏస్ హీరో డేట్ లు ఇచ్చి, తరువాత సినిమా చేయిస్తామని డీల్ ప్రపోజ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే ఈ ప్రాజెక్టును బెయిలవుట్ చేయడానికి ఓ బాలీవుడ్ సంస్థ కాస్త ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ యాభై కోట్లు అడ్వాన్స్ ఇవ్వడానికి ఆ సినిమా కాపీ రైట్స్ దగ్గర వుంచుకోవడానికి డిస్కషన్లు సాగుతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే కానీ ఆ సినిమా 'ప్రాణం' కుదుటపడదు.