ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. కళియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలను సమర్పించారు. సంపూర్ణ సంప్రదాయ రీతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించారు. బహుశా వెంకన్నకు ఈ తరహాలో పట్టువస్త్రాలను సమర్పించే అవకాశం వచ్చిన తండ్రీకొడుకులు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లకు మాత్రమేనేమో!
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వైఎస్ వెంకటేశ్వరుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఇప్పుడు ఆయన తనయుడికి ఆ మహద్భాగ్యం దక్కింది. జగన్ ఇది వరకూ కూడా తిరుమలకు వెళ్లారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేయడానికి బీజేపీ, టీడీపీ, పచ్చమీడియా వర్గాలు అవిశ్రాంతంగా ప్రయత్నించాయి.
రాష్ట్రంలో మత కలహాలు జరుగుతున్నాయని పచ్చమీడియాల హెడ్డింగులు పెడుతుంటే సామాన్యులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. తిరుపతిలో అత్యంత టెన్షన్ టెన్షన్ గా ఉందంటూ నిన్నటి నుంచి బ్రేకింగ్ లు! మరి జగన్ డిక్లరేషన్ పత్రం మీద ఇప్పుడు కొత్తగా సంతకం పెట్టాలా, పెట్టాడా.. అనేది పచ్చమీడియాకు ఎరుక కానీ, ఆ తిరునామాలకు మించిన డిక్లరేషన్ ఏముంటుంది?
ఎంత మంది వీరహిందుత్వవాదులు తిరువీధుల్లో తిరునామాలతో తిరిగారో.. ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకుని ఆ తర్వాత రాజకీయ ప్రేలాపనలు చేయాలి, అలా చేయాలంటే మనస్సాక్షి అంటూ ఒకటి ఉండాలి!