టీడీపీ కి రెబెల్ రెడీ…!

తెలుగు దేశం పార్టీ అసలే ఏటికి ఎదురీదుతోంది. నాలుగేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ భారీ ఓటములను చవి చూసింది. ఎన్నికల ఏడాది లో అయినా ఎక్కడో ఒక చోట…

తెలుగు దేశం పార్టీ అసలే ఏటికి ఎదురీదుతోంది. నాలుగేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆ పార్టీ భారీ ఓటములను చవి చూసింది. ఎన్నికల ఏడాది లో అయినా ఎక్కడో ఒక చోట సత్తా చాటితే ఊపిరి తీసుకోవచ్చని చూస్తోంది. ఈ మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన జాతకాన్ని పరీక్షించుకుందామని తెలుగుదేశం చూస్తోంది.

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీకి పోటీ పెట్టింది. అయితే ఎన్నో తడబాట్లు పొరపాట్లు జరుగుతున్నాయి. మొదట అనుకున్న బీసీ మహిళా అభ్యర్ధిని సడెన్ గా మార్చేశారు. అదేమంటే నాలుగు కోట్ల రూపాయల వరకూ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పి రెండవ క్రిష్ణుడిని రంగంలోకి దించారు. దాంతో పాటు కాపు కార్డు ని అండగా పెట్టుకున్నారు.

పోలింగ్ కి గడువు దగ్గర పడుతున్న వేళ కేవలం నెల రోజుల గ్యాప్ లో క్యాండిడేట్ ని మార్చి టీడీపీ తంటాలు పడుతోంది. ఇంతలో అనూహ్యంగా అదే పార్టీ నుంచి రెబెల్ రెడీ అయ్యారు. సీనియర్ నేత ఈర్లె శ్రీరామమూర్తి తాను ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఈర్లె శ్రీరామమూర్తి పోటీ టీడీపీకి దెబ్బ తీసే అవకాశం ఉంది అని కంగారు పడుతున్నారు. అసలే ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన హిస్టరీ టీడీపీకి లేదు. అధికార వైసీపీకి పోటీగా బరిలోకి దిగి సై అంటున్న వేళ సొంత పార్టీలోనే రెబెల్ వ్యవహారం చికాకు పెట్టేలాగానే ఉంది అంటున్నారు.

ఇప్పటికే బీసీ మహిళను అభ్యర్ధిగా ప్రకటించి మధ్యలో పక్కన పెట్టడం పట్ల బీసీలలో అసంతృప్తి ఉందని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రా కంచుకోట అని చెప్పుకోవాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే బెడిసికొడుతున్నాయా అన్న మాట వినిపిస్తోంది. ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సొంత ఓటు బ్యాంక్ ఉంది. వామపక్షాలకు బలం ఉంది. అధికార వైసీపీ అన్ని అనుకూలతలను తమ వైపు తిప్పుకుంటోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగిన టీడీపీ వ్యవహారమే ఏమీ తేలకుండా ఉంది అంటున్నారు. రానున్న రోజుల్లో సర్దుకోకపోతే పోటీ చేసినా సుఖమేముంది అని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అసలు ఈ ఫీట్ అవసరమా అని కూడా సొంత పార్టీలోనే అంటున్నారట.