కేసీఆర్ టెన్షన్.. ప్రజల నాడి పట్టుకునేందుకు టీమ్

దళితబంధు పథకం ప్రపంచంలోనే గొప్పది అని ఊదరగొట్టారు. దళితులకు చేసే భారీ ఆర్థిక సాయంతో హుజూరాబాద్ లో ఫలితాలు తారుమారైపోతాయని అంచనా వేశారు. కానీ కేసీఆర్ లెక్క తప్పింది.  Advertisement కేసీఆర్ ఏమీ దేవుడు…

దళితబంధు పథకం ప్రపంచంలోనే గొప్పది అని ఊదరగొట్టారు. దళితులకు చేసే భారీ ఆర్థిక సాయంతో హుజూరాబాద్ లో ఫలితాలు తారుమారైపోతాయని అంచనా వేశారు. కానీ కేసీఆర్ లెక్క తప్పింది. 

కేసీఆర్ ఏమీ దేవుడు కాదని, టీఆర్ఎస్ పేరు చెబితే జనాలకేమీ పూనకాలు రావని తేలిపోయింది. దీంతో గులాబీ దళపతి ఆలోచనలో పడ్డారు. పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నా, హుజూరాబాద్ గెలుపుతో రాష్ట్ర స్థితిగతులు ఏమీ మారిపోవని సర్దిచెప్పుకుంటున్నా లోలోపల మాత్రం భవిష్యత్ భయం కేసీఆర్ ని వెంటాడుతోంది. అందుకే ఇప్పుడు పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చేందుకు సర్వేల సాయం తీసుకోబోతున్నారు.

అందరికీ ఐ ప్యాక్..

ఇప్పటికే తెలంగాణలో షర్మిల పార్టీతో ఐ-ప్యాక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా ఐ-ప్యాక్ సాయం తీసుకోవాలనుకుంటున్నారు. ప్రగతిభవన్ లో ఆ సంస్థ సభ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారు కూడా. 

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, ప్రభుత్వ పనితీరు అంచనా వేయడంతో పాటు.. ఏ వర్గం ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ఏ వర్గంలో అసంతృప్తి ఉంది, ఏ సామాజిక వర్గం టీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో మద్దతిస్తోంది అనే కోణంలో సర్వే చేయాలని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అసలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, లేక మార్పులేమైనా కోరుకుంటున్నారా అనే విషయంపై ప్రజాభిప్రాయం సేకరించాలని సదరు సంస్థకు కేసీఆర్ ఆదేశాలిచ్చారట.

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి దఫా పాలన ముగియకముందే ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ కి, ఇప్పుడు హుజూరాబాద్ ఫలితాల తర్వాత కేసీఆర్ కి చాలా తేడా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ శత్రువర్గమంతా ఒకేచోటకు చేరుకుంటుందనే భయం ఆయనలో పెరిగిపోతోంది. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో ఆ విషయం రుజువైంది.

బీజేపీ, కాంగ్రెస్ కలసిపోయి టీఆర్ఎస్ ని ఓడించాయి అని కంటితుడుపు మాటలు చెప్పుకున్నా.. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ లోపాయికారీ ఒప్పందం అలానే ఉంటే టీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేదే ప్రశ్నార్థకం. అందుకే ఈ సర్వేలతో అసలు జనం నాడి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్.

సర్వేలతో సరిపెడతారా..?

జనం నాడి పట్టుకోవడంలో తానే నెంబర్-1 అనేది కేసీఆర్ ఆలోచన. అయితే ఆ అంచనాలు ఇప్పుడు తప్పేలా ఉన్నాయి. అందుకే ఐ-ప్యాక్ వంటి సంస్థల సహాయం తీసుకోవాలనుకుంటున్నారాయన. 

అవసరమైతే రాజకీయ సలహాలు కూడా తీసుకొని, ఎన్నికల విషయంలో కలసి పనిచేసేందుకు కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నారట. అయితే ప్రస్తుతానికి సర్వేల వరకు ఐ-ప్యాక్ ని ఉపయోగించుకుని, ఆ తర్వాత ఎన్నికలకు సిద్ధం కావాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తమ్మీద హుజూరాబాద్ ఎఫెక్ట్ కేసీఆర్ పై బాగానే పడినట్టు కనపడుతోంది. ఏకంగా ఐ-ప్యాక్ తో ప్యాకేజీ మాట్లాడేసుకుంటున్నారు.