జ‌గ‌న్ స‌ర్కార్‌పై ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డ హీరో

జ‌గ‌న్ స‌ర్కార్‌పై హీరో సిద్ధార్థ్ ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డాడు. ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు, హిత‌వు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కార్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్ర‌యాలు, అలాగే బెన్‌ఫిట్ షోల ర‌ద్దు, అధిక ధ‌ర‌ల‌కు టికెట్ల…

జ‌గ‌న్ స‌ర్కార్‌పై హీరో సిద్ధార్థ్ ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డాడు. ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు, హిత‌వు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కార్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆన్‌లైన్‌లో టికెట్ల విక్ర‌యాలు, అలాగే బెన్‌ఫిట్ షోల ర‌ద్దు, అధిక ధ‌ర‌ల‌కు టికెట్ల విక్ర‌యాల‌పై కొర‌డా ఝుళిపించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌ల పెంపున‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో హీరో సిద్ధార్థ్ ట్వీట్లు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి. ప్ర‌త్యేకంగా ఒక ప్ర‌భుత్వ‌మ‌ని ప్ర‌స్తావించ‌కుండా పాల‌నా విధానాల‌ను ఆయ‌న తూర్పార ప‌డుతూ ట్వీట్లు చేశారు. ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కార్‌ను దృష్టిలో పెట్టుకునే ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

#SaveCinema అంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న స‌ద‌రు హీరో ట్వీట్ల సంగ‌తేంటో చూద్దాం.

‘ సినిమా టికెట్లు, పార్కింగ్‌ రేట్లపై ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు లేదు. సినిమా కంటే మద్యం, పొగాకుకు మీరు ఎక్కువ గౌరవమిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దురాచారాన్ని ఆపండి. ఎన్నో వేల మంది ప్రజలు పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. మా వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలో మీరు మాకు చెప్పకండి. పన్నులు, సెన్సార్‌ విషయంలో మీరు ఏం చెప్పినా వింటాం. కానీ, నిర్మాతలు, వాళ్ల ఉద్యోగులకు జీవనోపాధి లేకుండా చేయకండి’

‘ సినిమా పరిశ్రమ ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు. సినిమా బడ్జెట్‌ అనేది కొనుగోలుదారుడిపై ఆధారపడదు. ఆ సినిమా దర్శకుడు, నిర్మాతపై ఆధారపడి ఉంటుంది. సినిమా ద్వారా ఎవరు ఎంత సంపాదిస్తారో నిర్ణయించే హక్కు ఏ ఒక్కరికీ లేదు. పేదరికం నుంచి వచ్చి ధనికులుగా రాణిస్తున్న రాజకీయనాయకులను ప్రశ్నించగలరా? పరిశ్రమను వేధించడం ఇకనైనా ఆపండి. మనకి తిండి పెడుతున్న రైతులు ఎంత గొప్పవాళ్లో మనందరికీ తెలుసు.. ఇప్పటికే వాళ్ల కోసం మేము పోరాటం చేశాం. మేము రైతులంత గొప్పవాళ్లం కాకపోవచ్చు. కానీ మేము కూడా మనుషులం, పన్నుచెల్లింపుదారులం’ అని సిద్ధార్థ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇన్ని నీతులు చెబుతున్న సిద్ధార్థ్‌… ప‌దేప‌దే ప్ర‌భుత్వాలు సినిమా రంగాన్ని ఆదుకోవాల‌ని ఎందుకు వేడుకుంటారో చెబితే బాగుండేద‌ని కొంద‌రు నెటిజ‌న్లు ఘాటు కామెంట్స్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అభిమానుల్ని దోచుకోవ‌డం త‌మ జ‌న్మ‌హ‌క్కు అన్న‌ట్టుంది సిద్ధార్థ్ తీరు అని మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో స్ట్రాంగ్ డోస్ ఇస్తున్నారు. సిద్ధార్థ్‌ను స‌మ‌ర్థించే వాళ్లు లేక‌పోలేదు. మొత్తానికి సిద్ధార్థ్ ట్వీట్లు పెద్ద ఎత్తున ర‌చ్చ‌కు దారి తీశాయ‌నడంలో అతిశ‌యోక్తి లేదు.