పచ్చ దళం గోల.. బలం తగ్గుతుందా?

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేసేయాలని, ఊపిరాడకుండా ఇబ్బంది పెట్టాలని, భయానికి గురిచేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చాలా కోరికలే ఉండవచ్చు. Advertisement అయితే…

సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేసేయాలని, ఊపిరాడకుండా ఇబ్బంది పెట్టాలని, భయానికి గురిచేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చాలా కోరికలే ఉండవచ్చు.

అయితే అందులో ఆయన ఏమేరకు సఫలం అవుతారన్నది మాత్రం డౌటే. తెలుగుదేశానికి ప్రజలు ఇచ్చిన సంఖ్యాబలమే బహు తక్కువ. అందులోనూ ఎంతమంది ఆయన వెన్నంటి ఉన్నారన్నది ఇప్పటికీ సందేహమే. ఇలాంటి నేపథ్యంలో శాసనసభలో ఆ పార్టీ గళం ఎలా ధ్వనిస్తుందో చూడాలి.

175 మంది సభ్యులుండే అసెంబ్లీలో తెలుగుదేశానికి కేవలం 23 సీట్లే దక్కాయి. వారు చరిత్రలో ఎరగని పరాభవం అది. చంద్రబాబునాయుడు అయిదేళ్లపాటు సాగించిన ప్రజాకంటకమైన పాలనను ప్రజలు ఎంతగా ఈసడించుకున్నారో, అసహ్యించుకున్నారో అనడానికి అది నిదర్శనం.

అయితే ప్రజలు బుద్ధి చెప్పిన దానికి తగినట్లుగా తమ ప్రవర్తనను, పనితీరును మార్చుకోకుండా చంద్రబాబునాయుడు అదే తరహాలో రెచ్చిపోతున్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారు.. అనే పడికట్టు మాటలు వాడుతూ.. రాష్ట్రాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

మొత్తానికి జగన్మోహన రెడ్డి సర్కారు మీద నిప్పులు చెరగుతూ శాసనసభను స్తంభింపజేయాలనే కోరిక మాత్రం చంద్రబాబుకు ఉంది. అసలే పడిశెం.. ఆపై ముక్కిడి అన్న సామెత చందంగా.. అసలే పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తక్కువైతే.. అందులోనూ ఆయన వెంటనిలిచేది ఎందరనే సందేహాలూ ఉన్నాయి.

గెలిచిన సంఖ్య 23లో ప్రస్తుతానికి ఒకటి జారిపోయింది. పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీని ఆ తర్వాత పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఇవాళ స్వతంత్ర సభ్యుడిగా శాసనసభకు హాజరు కానున్నారు. ఆయన వైకాపా లో చేరితే.. ఆ కారణం చూపి అనర్హత వేటు వేయించాలని తెదేపా నిరీక్షిస్తోంది. 22గా మారిన సంఖ్యాబలంలో.. పదిమందికి పైగా ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వారంతా శాసనసభలో చంద్రబాబు ఎజెండా మేరకు ఏమాత్రం ఆందోళనల్లో పాల్గొంటారో తెలియదు.  భాజపాలోకి వెళ్లదలచుకున్న వారు కాస్త గోలచేస్తారేమో గానీ.. వంశీ లాగా వైకాపాతోనే అంటకాగదలచుకున్న వారు మాత్రం.. బాబు మాటలకు జై కొట్టకుండా కిమ్మనకుండా ఉంటారు. గైర్హాజరైనా ఆశ్చర్యం లేదు. మరి బాబు ఎంతగా బీరాలు పలుకుతున్నా.. ఆయన పార్టీ వాస్తవ బలం ఏమిటో ఈ సమావేశాల్లో తేలుతుంది.