మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇటీవలి కాలంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు ఆమోదం కోసం సభ ముందుకు రాబోతున్నాయి.
విడివిడిగా.. వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు పథకాలను ప్రభుత్వం ప్రకటించడం వేరు. ఒకే సమయంలో అసెంబ్లీలో ప్రతిరోజూ ఇవన్నీ చర్చకు రావడం వేరు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం మొత్తం ఒక్కసారిగా ప్రజల దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది.
సరిగ్గా ఈ పరిణామాన్నే తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతున్నది. ప్రభుత్వానికి కీర్తి దక్కడానికి వీల్లేదు. ఏం చేసైనా సరే.. వారి పథకాల గురించి సభలో పాజిటివ్ చర్చే జరగడానికి వీల్లేదు. వీలైనంత రభస చేయడంద్వారా.. శాసనసభలో గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ప్రభుత్వం పెట్టే బిల్లులన్నీ పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందే పరిస్థితి కల్పించాలి.
తద్వారా జగన్ సర్కారుకు దక్కగల కీర్తిని కాస్త అడ్డుకున్నట్లు అవుతుంది… ఈ ఒక్క ఎజెండాతోనే వారు అసెంబ్లీకి సిద్ధం అవుతున్నారు.అసెంబ్లీ సమావేశాల్లో పాలకపక్షాన్ని నిలదీయాలని, వారి వైఫల్యాలను ఎత్తిచూపించాలని చంద్రబాబునాయుడు ఆల్రెడీ తన పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చారు. ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్నది కేవలం 22 మంది ఎమ్మెల్యేలు… 151 మంది అధికార పార్టీ సభ్యులున్న సభలో వారు పద్ధతిగా వ్యవహరిస్తే చర్చల్లో వారు సోదిలో కూడా కనిపించరు.
వారికి దక్కగల ప్రసంగ సమయం అవకాశాలను నిజాయితీగా వాడుకుంటే.. వారి అభ్యంతరాలు కూడా ఎవ్వరికీ వినిపించవు. కానీ.. అంత పద్ధతిగా సభలో వ్యవహరిస్తే వారు చంద్రదళం ఎందుకవుతారు?
సభలో ప్రభుత్వాన్ని నిలదీయడం పేరిట రచ్చరచ్చ చేయాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల మీద అర్థవంతమైన చర్చ జరగకుండా అడ్డుకోవాలి. ఇదొక్కటే వారి ఎజెండా. అందుకు ఎంచుకున్న వివిధ అంశాల్లో అమరావతి, భూముల విక్రయాలు లాంటి అంశాలున్నాయి.
వాటితో పాటు… వర్షాల కారణంగా తలెత్తి తర్వాత అంతరించిపోయిన ఇసుక సమస్య వంటివి కూడా ఉన్నాయి. ప్రతిరోజూ ఒక కొత్త అంశాన్ని రేకెత్తి రభస చేయడానికి తెదేపా సిద్ధం అవుతోంది. జగన్ సర్కార్ వారి వ్యూహాలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.