నాగచైతన్య-బాబి కాంబినేషన్ లో తెరకెక్కిన వెంకీ మామ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది. నిజానికి నాగచైతన్య కోసం బాబి రాసుకున్న కథ ఇది కాదు. ఓ మంచి లవ్ స్టోరీ రాసుకున్నాడు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో అటు బాబి, ఇటు చైతూ ఇద్దరూ ఈ విషయాన్ని బయటపెట్టారు. మరీ ముఖ్యంగా ఎప్పటికైనా చైతూతో ఆ లవ్ స్టోరీ చేస్తానంటున్నాడు బాబి.
“మంచి లవ్ స్టోరీ రాసుకున్నాను. కానీ అప్పటికే మీరు మజిలీ సినిమాకు కమిట్ అయ్యారు. మంచి సినిమా చేశారు. అదే టైమ్ లో నాకు మీరు చెప్పిన సజెషన్స్ ఫాలో అవుతాను. లవ్ స్టోరీలో మరిన్ని మార్పులు చేసి, బౌండెడ్ స్క్రిప్ట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాను.”
అటు చైతూ కూడా ఈ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లవ్ స్టోరీ చాలా క్రేజీగా ఉందని.. బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే సమంతతో కలిసి ఆ స్టోరీ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేశాడు. మరోవైపు సురేష్ బాబుతో తనకున్న అనుబంధం గురించి కూడా గుర్తుచేసుకున్నాడు చైతూ.
“నాకు ఏదైనా డౌట్ ఉంటే కోరి సురేష్ మామను అడుగుతా. ఎందుకంటే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చాలా కొత్తగా ఉంటుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయన చెప్పే విధానం కొత్తగా ఉంటుంది. ఆ క్యూరియాసిటీతో వెళ్తాను. కొన్నిసార్లు ఇలా వినేసి అలా వచ్చేస్తుంటాను. కానీ కొన్నిసార్లు ఆయన సలహాలు చాలా బాగుంటాయి.”
వెంకీ మామలో అన్నీ ఉన్నాయంటున్నాడు చైతూ. ఇద్దరు హీరోలు, 2 లవ్ స్టోరీలు, మంచి ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్.. ఇలా అన్నీ కుదిరాయని చెబుతున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాడు వెంకీ మామ.