అసెంబ్లీ సమావేశాల సమయానికి ప్రతిపక్షాలకు సరిపడినంత సరంజామా సమకూరుతోంది. ఇసుక లభ్యత, ఆంగ్ల మాధ్యమం వంటి అంశాలు పూర్తిగా పాతపడిపోగా.. ఆర్టీసీ చార్జీల పెంపు, ఉల్లి ధరల వంటి అంశాలు వారికి ముడిసరుకుగా మారబోతున్నాయి. ఇక ప్రతిపక్షాలపై దాడులు అనే ఎవర్ గ్రీన్ అంశం ఉండనే ఉంది. జోరు వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ, చెరువులు, ప్రాజెక్ట్ లన్నీ నీటికుండల్లా మారి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉన్నవేళ ప్రతిపక్షాలు మాత్రం తమకు అంది వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాయి.
అయితే ఈసారి కూడా చంద్రబాబుకి అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి వంటి రెండు మూడు గొంతులు మాత్రమే సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి గంటా ఎప్పటినుంచో సైలెంట్ గా ఉన్నారు, బాలయ్య సభకు వచ్చినా అసలు ఆయన ఉనికే తెలియడం లేదు. మిగతావాళ్లు మాకెందుకొచ్చిన తంటా అనుకుని సైలెంట్ గా ఉంటున్నారు. రాగా పోగా చంద్రబాబే రెండు మాటలు అని, నాలుగు అనిపించుకోడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు.
అటు వల్లభనేని వంశీ సొంత పార్టీ పైనే విమర్శలు చేసే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎలా ప్రవర్తిస్తారో ఊహలకు అందడం లేదు. సభలో ఆయన జగన్ ని ఆకాశానికెత్తేస్తారు, బయట జనసేనాని పవన్, జగన్ ని అసలు ముఖ్యమంత్రిగా గుర్తించను అంటారు. ఈ పార్టీ వ్యవహారమేమిటో ఈ దఫా సమావేశాల్లో కూడా సందిగ్ధమే.
ఇక పోతే అసమ్మతి స్వరం వినిపించి జగన్ కి ఆగ్రహం తెప్పించిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈ సమావేశాలను తన ప్రాయశ్చిత్తానికి వేదికగా వాడుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. జగన్ స్తోత్రాన్ని పఠించి, అధినాయకుడిని శాంతింపజేసే ఉద్దేశంలో రామనారాయణ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు ఈ దఫా మరింత వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని, అభివృద్ధి కుంటుపడుతోందని, సూచికల్లో ఏపీ కిందకు వెళ్తోందని యథాప్రకారం మొత్తుకుంటూనే జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి చంద్రబాబు సిద్ధమైపోయారు. జగన్ మాత్రం తన సంక్షేమ మంత్రాన్నే తిరిగి జపించబోతున్నారు.