పవన్ కల్యాణ్ బహిరంగ సభలను ఎప్పుడైనా లైవ్ లో గానీ, ప్రత్యక్షంగా గానీ చూశారా? ప్రత్యేకించి ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనించారా? సభాప్రాంగణం మొత్తం పెద్దఎత్తున గోలగోలగా ఉంటుంది. అరుపులు కేకలు విజిల్స్ పవన్ అభిమానగణం.. పెద్దపెట్టున పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉంటారు. మరో రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ కూడా.. ఇలాంటి వెర్రెత్తిపోయే అభిమానుల విజిల్స్ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఆయనకు చిర్రెత్తుకొస్తే మాత్రం వారిమీదనే చిందులు వేస్తారు.
మండపేటలో పవన్ కల్యాణ్ రైతు సదస్సు నిర్వహించారు. ఎప్పటిలాగే పవన్ కల్యాణ్ సభ అనే సరికి ఆయన అభిమానులందరినీ పోగేశారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలో అయినా సరే.. పవన్ సభ పెడితే అది ఎలా జరుగుతుందో.. అదే తరహాలో ఇక్కడ కూడా అరుపుల కేకలతోనే సభ సాగింది. కాకపోతే… ఇక్కడ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులకే ఈ సందడి చూసి చిరాకేసింది. దాంతో పవన్ కల్యాణ్ కూడా.. అభిమానులను కోప్పడ్డారు.
కానీ.. పవన్ కల్యాణ్ అభిమానుల్ని ఉద్దేశించి అన్నమాటలు మాత్రం చాలా తీవ్రమైనవి. అభిమానుల్లో, కార్యకర్తల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే తమ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది నిజంగా అభిమానుల్ని గాయపరిచే మాట. నిజానికి పవన్ కు ఆ ఆరుశాతం ఓట్లయినా వచ్చాయంటే దానికి ప్రధాన కారణం ఆ అభిమానులే. ఊర్లలో ఇతర పార్టీల నాయకులు, చివరికి తమ తమ ఇళ్లలోని పెద్దలు ఎలా చెప్పినా కూడా.. వారు మాత్రం చాలా దృఢంగా పవన్ వైపు నిలబడి ఆయన పార్టీకి ఓట్లు వేశారు. పవన్ కు డిపాజిట్లు దక్కాయంటే వారి పుణ్యమే. అలాంటిది… ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడన్నట్లుగా కార్యకర్తల వల్లనే ఓడిపోయానని పవన్ అనడం చిత్రం.
సాధారణంగా ఏ పార్టీ అయినా.. కార్యకర్తల్ని నెత్తిన పెట్టుకుంటుంది. కార్యకర్తలని దేవుళ్లుగా అభివర్ణిస్తుంది. కానీ.. పవన్ తీరు అంతా చిత్రంగా ఉంది. ఆయన తనను ఆరాధించే వారిని ఇలా తక్కువ చేసి మాట్లాడడం చర్చనీయాంశం అవుతోంది. ఆ సందర్భంలో అరుపులు కేకలు వేసిన వారిపట్ల పవన్ కు కోపం వచ్చి ఉండొచ్చు కానీ.. సాధారణంగా ప్రభుత్వాల్ని తిట్టే తన ప్రసంగాల్లో.. వారి అరుపులు కేకలు విజిల్స్ కోసమే పవన్ పలుమార్లు హఠాత్తుగా పూనకం తెచ్చుకుంటూ ఉంటాడు. ఈసారి ఇలా వారిని తూలనాడడం.. పార్టీకి మంచిది కాదని పలువురు అంటున్నారు.