తమిళనాడులో కొత్తగా పుట్టిన సినిమా పార్టీలు చిత్రంగా వ్యవహరిస్తున్నాయి. తమకు ప్రజాబలం అక్కర్లేదు.. ఏకంగా సీఎం పీఠం మాత్రమే కావాలి అన్నట్లుగా వారి రాజకీయ అడుగులు, పోకడలు కనిపిస్తున్నాయి. త్వరలో ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతుండగా.. ఆ బరిలోకి దిగిపోటీచేసే ఉద్దేశం ఇటు రజనీ, అటు కమల్ పార్టీలు రెండింటికీ లేదు. కాకపోతే.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలమీద మాత్రం ఫుల్ ఫోకస్ పెడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రజనీ మక్కల్ మండ్రం వేరే ఏ పార్టీకీ మద్దతు ప్రకటించడం లేదని గతంలోనే ప్రకటన వచ్చింది. ఏ పార్టీ వారైనా సరే.. చివరికి రజనీ ఫోటోను వాడుకున్నా కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే తమ లక్ష్యమని రజినీ గతంలోనే ప్రకటించారు.
తాజాగా కమల్ హాసన్ కూడా.. రజినీ బాటలోనే అడుగులు వేస్తున్నారు. ఈ నెలలోనే జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మక్కల్ నీది మయ్యం పోటీచేయబోయేది లేదని కమల్ తాజాగా ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా మాత్రమే సిద్దమవుతున్నాం అని ఆయన పేర్కొన్నారు.
ఈ ఇద్దరు సినీనటుల రాజకీయ భావజాలం ఒకే తీరుగా, చిత్రంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి శాసనసభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంచాయతీ ఎన్నికలు వస్తే గనుక.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కొత్త పార్టీలు ఉత్సాహం చూపించాలి. ఆ రూపేణా కిందిస్థాయి గ్రామీణ ఓటర్ల వరకు తమ పార్టీని తీసుకెళ్లడానికి మంచి అవకాశం వచ్చిందని సంతోషించాలి. ఇలాంటి ఎన్నికలను పట్టించుకోకుండా.. ఒకేసారి అసెంబ్లీ ఎన్నికల్లో దిగడం వలన.. గ్రామాల్లోని చాలా మందికి.. పార్టీ గురించి అవగాహన లేక.. ఫలితాల్లో బోల్తా కొట్టే ప్రమాదం ఉంటుంది. అందువలన వారే.. అందుకు ఆరాటపడాలి.
కానీ కమల్, రజనీ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమకు నేరుగా అసెంబ్లీ పీఠం కావాల్సిందే తప్ప.. ఇలా స్థానిక ఎన్నికల పనిభారం అక్కర్లేదని, ప్రజాబలం కూడా అక్కర్లేదని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సినిమాలనుంచి షార్ట్ కట్ లో రాష్ట్రాధినేతలు అయిపోవాలనుకునే వారి ధోరణి స్పష్టంగానే కనిపిస్తోంది.