చంద్రబాబుకు మంచి వంటవాళ్ళు దొరికారు!

చంద్రబాబు నాయుడుకు చాలా మంచి వంట వాళ్ళు దొరికారు. వాళ్లు రకరకాల మసాలా దినుసులు, మార్కెట్లో ఎక్కడా దొరకని సుగంధ ద్రవ్యాలు, మసాలాలు ప్రత్యేకంగా తయారు చేసి మరి ప్రపంచం కనీవినీ ఎరుగని అత్యద్భుతమైన…

చంద్రబాబు నాయుడుకు చాలా మంచి వంట వాళ్ళు దొరికారు. వాళ్లు రకరకాల మసాలా దినుసులు, మార్కెట్లో ఎక్కడా దొరకని సుగంధ ద్రవ్యాలు, మసాలాలు ప్రత్యేకంగా తయారు చేసి మరి ప్రపంచం కనీవినీ ఎరుగని అత్యద్భుతమైన వంటకాలను సిద్ధం చేయగలరు. వంటలో వారి నేర్పరితనం అసమానం, అనన్యం. అలాంటి వంటవాళ్లతో ప్రత్యేకంగా ఎక్కడెక్కడ నుంచో తెప్పించిన స్పెషల్ దినుసులు అన్నింటిని కలిపి వండించిన ఒక వికృతమైన వంటకాన్ని తాజాగా తెలుగుదేశం పార్టీ ఆవిష్కరించింది. ఆ వంటకాన్ని రాష్ట్రమంతా ఇంటింటికి పంచి పెడతాం అని ప్రగల్భాలు పలుకుతోంది. ఇంతకూ ఆ వంట పేరేమిటో తెలుసా 'జగనాసుర రక్త చరిత్ర బహిరంగం' అట!

‘కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ప్రధాన నిందితుడు జగన్’ అని నిందలు వేసేలాగా, తెలుగుదేశం పార్టీ తాజాగా ఒక కొత్త పుస్తకాన్ని ప్రచురించింది. ఈ హత్య విషయంలో ఇప్పటికీ సిబిఐ విచారణ కొనసాగుతూ ఉండగా, వ్యవహారం కోర్టులో ఉండగా హత్య చేయించింది జగనే అని ఆరోపిస్తూ పుస్తకం ప్రచురించడం అనేది అత్యంత వివాదాస్పదం.

చంద్రబాబు నాయుడు పురమాయించిన సరికొత్త నిపుణులైన వంటగాళ్ళు.. ఇందులో చాలా చాలా మసాలాలను  దట్టించారు. 2019లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడనే భయంతో జనం సానుభూతి సంపాదించుకోవడానికి, అధికారకాంక్ష నెరవేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేయించారట! ఈ ఆరోపణ ఎంత కామెడీగా ఉన్నదో కనీసం తెలుగుదేశం నాయకులకు అయినా అర్థమవుతున్నదో లేదో!

ఎందుకంటే వైయస్ వివేకానంద రెడ్డి కేవలం అన్న చాటు తమ్ముడు మాత్రమే. ఆయనకు రాష్ట్రవ్యాప్త ఇమేజ్ ఏ మాత్రం లేదు. ఆయన హత్య రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపన సృష్టిస్తుందనే ఆశ కూడా తప్పు. అలాంటి వివేకానంద రెడ్డిని హత్య చేయించడం ద్వారా తనను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్ట గల స్థాయి ప్రజల సానుభూతి పొటెత్తుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనా వేశారని ఆరోపించడం చాలా చిల్లరగా కనిపిస్తోంది.

వివేకానంద రెడ్డి హత్య జరిగిన నాటికి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారు. ఆ హత్య కేసును తనకు అసంబద్ధంగా ముడిపెడుతున్నారని అభిప్రాయం ఆయనకు కలిగి ఉంటే గనుక.. ఆనాడే సీరియస్ విచారణతో విషయం తేల్చేసి ఉండవచ్చు. ఆనాడే మరింత గట్టి విచారణకు ఆదేశించి వివరాలు నిగ్గుతేల్చి ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు అలాంటి పని చేయలేకపోయారు. అది ఆయన చేతకానితనం. 

తాజాగా కేసు సిబిఐ చేతికి వెళ్లిన తర్వాత విచారణ ఒక కొలిక్కి వస్తున్న సమయంలో.. అసలు నిందితులెవరో త్వరలోనే తేలుతుంది అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో.. మొత్తం హత్య ఎపిసోడ్ ను జగన్మోహన్ రెడ్డికి ముడిపెడుతూ తెలుగుదేశం పార్టీ తన వంటకాలతో రాయించి ప్రచురించిన ఈ పుస్తకం చాలా నీచమైన టెక్నిక్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తన దుర్బుద్ధులు ప్రజలు గమనిస్తే తన పరువే పోతుందని చంద్రబాబు నాయుడు తెలుసుకుంటే మంచిదని అంటున్నారు.