అతిగా మాట్లాడడం, అతివాదం ప్రదర్శించడం ద్వారా మాత్రమే రాజకీయంగా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించగలం, ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకోగలం అనే ఎజెండా భారతీయ జనతా పార్టీలో కొందరు నాయకుల వ్యవహారం. అతివాదం ద్వారా ఆకట్టుకోవడం అనే రాజనీతి వారిలో తొలినుంచి ఉన్నదే. ఇప్పుడు అది శృతిమించుతున్నది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం నిర్మిస్తున్న కొత్త సచివాలయ భవనంపై గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించడం చాలా హేయంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. అప్పటికే చాలా పాతబడి ప్రమాదకరంగా మారిన సచివాలయ భవనాలను కూలగొట్టి కొత్త సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ సంకల్పించారు. డిజైన్లను రూపొందించి ఆ ప్రకారం నిర్మిస్తున్నారు. అత్యద్భుతమైన రీతిలో హైదరాబాదు నగరానికే వన్నె తెచ్చేలా తెలంగాణ సచివాలయ నిర్మాణం జరుగుతోంది. ఎవరు ఏం అనుకున్నా సరే.. ఈ సచివాలయం పూర్తయితే ఆ ఘనత కేసీఆర్ ఖాతాలో ఉండిపోతుంది. సహజంగానే దాన్ని చూసి బిజెపి ఓర్వలేదన్నది సత్యం.
అయితే స్ట్రీట్ కార్నర్ సమావేశాలు అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బిజెపి నాయకుడు బండి సంజయ్ తన అక్కసును దాచుకోలేకపోతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఆ గుమ్మటాలను కూల్చివేయిస్తాం అంటున్నారు. ఇంకోరకొంగా చెప్పాలంటే.. అసలు బిజెపి అధికారంలోకి వస్తుందేమో అని ప్రజలు, ఆ సచివాలయ భవనాన్ని ఇష్టపడేవాళ్లు భయపడే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
నాయకులకు నిర్మాణాత్మక, ఆచరణాత్మక దృక్పథం ఉండాలి. విధ్వంసక బుద్ధులు మంచివి కాదు. సచివాలయ భవనం తాజ్ మహల్ లాగా ఉన్నదని ఒవైసీ అన్నందుకు బండి సంజయ్ ఆక్రోశించడం ఎందుకో అర్థం కాదు. తాజ్ మహల్ ఒక సమాధి.. సమాధితో పోలిస్తే మిన్నకుంటారా అని చాలా సంకుచితంగా మాట్లాడుతున్నారు. సచివాలయ గుమ్మటాలను కూల్చేసి దేశ సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మిస్తారట. అంటే బహుశా గుమ్మటం స్థానంలో గుడిగోపురం కట్టాలనుకుంటున్నారేమో తెలీదు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ ను నక్సల్స్ పేల్చేయాలని పిలుపు ఇచ్చి అభాసుపాలయ్యారు. తన నోట తప్పు మాట దొర్లిందని గ్రహించి.. నాలుక కరచుకుని దాన్ని ప్రజాదర్భార్ చేస్తాం అన్నారు. బండి సంజయ్ కూడా ప్రగతి భవన్ ను ప్రజాదర్బార్ గా మారుస్తాం అంటున్నారు గానీ.. సచివాలయం మీద ఇంతగా విషం కక్కడం మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇలాంటి విధ్వంసక బుద్ధులతో వీళ్లు ప్రజలకు ఏం మంచి చేస్తారో కదా అనిపిస్తోంది!