పవన్ కల్యాణ్ ముందు బాలయ్య దేబిరింపు

కొన్ని నెలల కిందటి సంగతి.. అన్ స్టాపబుల్ సీజన్-1.. బాలయ్య ఇంటర్వ్యూ చేస్తున్నారనగానే చాలామంది దర్శకులు షోకు వచ్చారు. అలా వచ్చిన ప్రతి దర్శకుడి ముందు బాలయ్య ఒకటే ప్రపోజల్. “నాతో సినిమా ఎప్పుడు?”…

కొన్ని నెలల కిందటి సంగతి.. అన్ స్టాపబుల్ సీజన్-1.. బాలయ్య ఇంటర్వ్యూ చేస్తున్నారనగానే చాలామంది దర్శకులు షోకు వచ్చారు. అలా వచ్చిన ప్రతి దర్శకుడి ముందు బాలయ్య ఒకటే ప్రపోజల్. “నాతో సినిమా ఎప్పుడు?”

వారానికో దర్శకుడు మారుతున్నాడు కానీ, బాలయ్య ప్రశ్నలో మార్పులేదు. మన కాంబినేషన్ ఎప్పుడు అంటూ ఓ రేంజ్ లో దేబిరించారు. అది బాలకృష్ణ బాల మనస్తత్వం, లేత హృదయం, భోళాతనం, సరదా వ్యాఖ్యానం అంటూ అతడి ఫ్యాన్స్ ఎంత కవరింగ్ చేసుకున్నప్పటికీ ఆయన దేబిరింపు మాత్రం ఆగలేదు.

ఇప్పుడిదంతా ఎందుకంటే, సీజన్-1తో అయిపోయిందనుకున్న ఈ ప్రహసనాన్ని సీజన్-2 ఆఖరి ఎపిసోడ్ లో మళ్లీ చూపించారు బాలయ్య. ఈసారి ఆయన దేబిరింపు పరాకాష్టకు చేరింది. ఎదురుగా ఉన్నది దర్శకుడు కాదు, హీరో పవన్ కల్యాణ్.

“బాలయ్య-పవన్” మల్టీస్టారర్ కోరుకుంటున్నారా లేదా అనేది ఈసారి ప్రశ్న. దానికి పవన్ కల్యాణ్ 'ఎస్' అంటూ సమాధానం రాసి చూపిస్తే, అదే సమాధానాన్ని స్టేజ్ కింద కూర్చున్న ప్రేక్షకులు కూడా చూపించారు. అక్కడే ఉన్న దర్శకుడు క్రిష్, నా దగ్గర కథ రెడీగా ఉందని అన్నాడు.

ఆ వెంటనే బాలయ్య మళ్లీ అందుకున్నారు. 2024లో చేసేద్దాం అంటూ ఆయనంతట ఆయనే ప్రకటించుకున్నారు. ఈసారి భయ్యా (పవన్)ది, నాది కాంబినేషన్ మామూలుగా ఉండదు అని కూడా చెప్పేసుకున్నారు. ఓవైపు ఇంత జరుగుతుంటే మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం బలవంతంగా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు.

ఈ సందర్భంగా పవన్-బాలయ్య మధ్య తేడా చెప్పాడు దర్శకుడు క్రిష్. పవన్ కల్యాణ్ ను మెథడ్ యాక్టర్ గా వర్ణించిన క్రిష్, బాలయ్యను క్లాసికల్ యాక్టర్ గా చెప్పుకొచ్చాడు. గూగుల్ చేస్తే, ఈ రెండు పదాలకు స్పష్టమైన అర్థాలు కూడా తెలుస్తాయని అంటున్నాడు.

మొత్తానికి మెథడ్ యాక్టర్ ను, క్లాసికల్ యాక్టర్ ను కలిపి మల్టీస్టారర్ తీయడానికి రెడీ అని ఇటు క్రిష్ ప్రకటిస్తే, అటు బాలయ్య దానికి మద్దతిచ్చారు. జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్టు పవన్ నవ్వి ఊరుకున్నాడు. ఎందుకంటే, గతంలో చిరంజీవి-పవన్ కాంబోలో సుబ్బరామిరెడ్డి ప్రకటించిన మల్టీస్టారర్ ప్రాజెక్టు సంగతి ఏమైందో అందరికీ తెలిసిందే.