ఏపీ కమలదళానికి జగన్ షాక్

మహా అయితే ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వచ్చిన తర్వాత.. అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి జాప్యం చేస్తూ మీడియాలో రకరకాల పుకార్లు రావడానికి సహాయపడగలరు. అంతకు మించి.. భాజపా ఢిల్లీ పెద్దలు జగన్‌ను ఏం చేయగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో…

మహా అయితే ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వచ్చిన తర్వాత.. అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి జాప్యం చేస్తూ మీడియాలో రకరకాల పుకార్లు రావడానికి సహాయపడగలరు. అంతకు మించి.. భాజపా ఢిల్లీ పెద్దలు జగన్‌ను ఏం చేయగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ కూడా ఖాళీ అయి జగన్ చెంతకు చేరుతూ ఉంటే ఎలా నిలువరించగలరు?  ముఖ్యమంత్రిగా దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. జగన్ మరింత ప్రజాబలాన్ని పెంచుకుంటూ ఉంటే వారు ఎలా నిలువరించగలరు? అనే అభిప్రాయాలే ఇప్పుడు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున తమ బాధ్యతగా అందించవలసిన సాయాన్ని పూర్తిగా విస్మరించి.. ఏదో పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్న సంగతి ప్రజలందరూ గుర్తిస్తున్నదే. కొత్తగా ఏర్పడిన అనాధ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ను సవతిబిడ్డలాగా చూడడం మాత్రమే కాకుండా.. ఈ రాష్ట్రంలో తాము అర్జంటుగా బలపడిపోయి అధికారంలోకి వచ్చేయాలని మాత్రం కలగంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ సర్కారు చేస్తున్న ద్రోహాన్ని ఇక్కడి ప్రజలెవ్వరూ గుర్తించలేరని వారు ఎలా అనుకుంటున్నారో తెలియదు.

అయితే ఇలాంటి కపటోపాయాలతో ప్రవర్తిస్తున్న భాజపాకు రాష్ట్రంలో గట్టి దెబ్బే తగలబోతోంది. సుదీర్ఘకాలంగా ఆ పార్టీని నమ్ముకుని ఉన్న గోకరాజు కుటుంబం మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం… వారికి ఊహించని పరిణామం కావొచ్చు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నప్పటికీ.. ప్రజా సంక్షేమం పరంగా.. తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి.. అపరిమితమైన ప్రజాబలం పెంచుకుంటున్నారు. విపక్ష పార్టీలకు చెందిన వారు కూడా.. ఎలాంటి కండిషన్లు పెట్టకుండా… జగన్ పార్టీలో చేరడానికి తరలి వస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ వంటి కోరికలు లేని వారిని మాత్రమే జగన్ తన పార్టీలోకి చేర్చుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు గోకరాజు సోదరులు, వారి కుటుంబం మొత్తం వైకాపాలో చేరబోతుండడం విశేషం. ఇప్పటికే అర్థం పర్థం లేని ఆరోపణలతో జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు, ఏపీకి ఏమీ చేయలేకపోయినా బలపడతామని అనుకుంటున్న కమలనాయకులు.. ఈ పరిణామంతో ఖంగుతింటున్నారు.