ఆడవాళ్లపై అఘాయిత్యాలు ఆగాలంటే ఎన్కౌంటర్లే పరిష్కారమనే తక్షణ న్యాయ డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరి ముందు ఒక ప్రశ్న నిలిచింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఎక్కడా ఆత్యాచారాలు, హత్యలు జరగవనే హామీ ఇస్తారా అనే ప్రశ్నించడం పూర్తి కాకుండానే చిత్తూరు జిల్లాలో బాలికపై ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండువారాల క్రితం చోటు చేసుకున్న దుర్ఘటనకు పాల్పడ్డ నిందితులను ఎన్కౌంటర్ చేద్దామా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తిరుచానూరులో ఇటీవల పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంత ప్రాధాన్యం ఉందో అంతే ప్రాధాన్యత అమ్మవారికి కూడా ఉంది. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుచానూరు వెళ్లేందుకు 16 ఏళ్ల బాలిక గత నెల 24న తిరుపతి రూరల్ పరిధిలోని పద్మావతిపురం వద్ద రోడ్డుపై నిలబడి ఉంది. అదే సమయంలో బ్రాహ్మణపట్టుకు చెందిన కారు డ్రైవర్ వెంకటేశ్ స్కూటర్లో వెళుతుండగా లిప్ట్ అడిగింది. స్కూటర్‌పై బాలికను ఎక్కించుకుని తిరుచానూరుకు బదులుగా ముళ్లపూడికి తీసుకెళ్లాడు. స్కూటర్లో పెట్రోల్ అయిపోయిందని బాలికను మభ్యపెట్టి, పద్మావతిపురం నివాసి అయిన తన స్నేహితుడు రామ్మోహన్నాయక్కు ఫోన్ చేసి నటించాడు.
అతను రాగానే ఇద్దరూ కలిసి బాలికను సమీపంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రామ్మోహన్‌నాయక్ రౌడీషీటర్. ఇంతకాలం గోప్యంగా ఉంచిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఇది దిశ ఘటన కంటే ముందే జరిగింది.
దిశ నిందితులకు విధించినట్టే వీరికి కూడా మరణశిక్ష విధించాలా? విధిస్తారా? మహిళలపై అత్యాచారం చేయడమే అమానుషం. కానీ హైదరాబాద్‌లో దిశపై, ఢిల్లీలో నిర్భయపై అత్యంత కిరాతకంగా నేరాలకు పాల్పడితే సమాజం కదిలింది. పోలీసుల చర్యలు కూడా అలాంటి నేరాల విషయంలోనే కఠినంగా ఉంటున్నాయి. చాలా కేసుల్లో ఉదారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోఫణలున్నాయి. అలా కాకుండా కేసు స్వభావం ఒకటే అయినప్పుడు శిక్షలు కూడా ఒకేలా ఉండాలి.
దిశలో ఒకలా, అయేషా, ఇతరత్రా కేసుల్లో మరోలా వ్యవహరిస్తే సమాజం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రతి రేప్ కేసు విషయంలోనూ బాధితులు తమకు న్యాయం జరగాలంటే నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుచానూరు రేప్ కేసులో నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తారో చెప్పాల్సి ఉంది.