పవన్ కల్యాణ్ తనను తాను ఒక చేగువేరాతో పోల్చుకుంటాడు. కానీ బహుశా పవన్ కల్యాణ్ ను ఎవరితో అయినా పోల్చాల్సి వస్తే.. ఆయనను ప్రపంచానికి అన్నీ తానే నేర్పించానని చెప్పుకుంటూ తిరిగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రపంచాన్నే తను నడిపిస్తున్నట్టుగా చెప్పుకునే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో పోల్చాలి. వీళ్ల ముగ్గురిలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏమిటంటే.. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఒకటో అంశం, పాల్ కు పవన్ కల్యాణ్ కు మరో పోలిక ఏమిటంటే ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోవడం! ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్నాకా పాల్ చాలా వరకూ కామ్ అయ్యారు. గతంలో కామెడీ ప్రకటనలు చేసిన ఆయన ఇప్పుడు ఆ తరహా ప్రకటనలు చేయడం లేదు.
ఎన్నికల సమయాల్లో మాత్రమే కేఏ పాల్ హడావుడి చేస్తూ ఉంటారు. కేఏ పాల్ ప్రకటనకు ఏ మాత్రం తీసిపోవడం లేదు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ప్రకటనలు కూడా. అమెరికాకు ట్రంప్ ను తనే అధ్యక్షుడిగా చేసినట్టుగా కేఏ పాల్ ప్రకటించుకుంటూ ఉంటారు. అందుకు ఏ మాత్రం తీసిపోరు పవన్ కూడా. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి తన భిక్షే అని పవన్ ప్రకటించుకోవడం.. ఆయనలోని కేఏ పాల్ ను గుర్తు చేస్తూ ఉంది.
ఇక్కడ మరో విషయాన్ని కూడా ప్రస్తావించాలి. పవన్ కల్యాణ్ కు కొన్ని విషయాల్లో చంద్రబాబుతో కూడా పోలిక వస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా ఇలా అధ్యక్షులను చేయడం, భారతరత్నలు ఇప్పించడాల గురించి ప్రకటనలు చేస్తూ ఉంటారు. ‘అబ్దుల్ కలాం ను రాష్ట్రపతి చేసింది నేనే..’ అంటూ చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ చాలా సార్లు ప్రకటించుకుని ఉంటారు. ఆయన తనయుడు లోకేష్ కూడా తనదైన శైలిలో ఆ ప్రకటన చేశారు ఆ మధ్య, అయితే యథావిధిగా లోకేష్ పప్పులో కాలేశారు. రెండు వేల పన్నెండులో అబ్దుల్ కలాం ను తన తండ్రి చంద్రబాబు నాయుడు దేశానికి రాష్ట్రపతి చేశారని లోకేష్ ప్రకటించుకున్నారు. ఎవరి స్టైల్ వాళ్లది!
ఎన్నికలు అయిపోయి ఆరు నెలలు అయినా గడవక ముందే పవన్ కల్యాణ్.. తన వెంట లక్షల మంది నడుస్తూ ఉన్నారని ప్రకటించుకుంటున్నారు. అలాగే ఎన్నికలు జరిగిన ప్రక్రియ మీద కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అదెలాగంటే.. ఒక ఊర్లో నూటా ఇరవై మంది తన పేరును, జనసేన గుర్తును పచ్చబొట్టుగా పొడిపించుకున్నారట. అయితే ఆ ఊళ్లో జనసేనకు పది ఓట్లు కూడా రాలేదట! ఇలా ఎన్నికల ప్రక్రియపై పవన్ అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ అనుమానాలు బాగానే ఉన్నాయి కానీ, ఇంతకీ ఆ పచ్చబొట్టు పొడించిన అమాయకులకు ఓటు హక్కు ఉందో లేదో పవన్ కల్యాణ్ తెలుసుకోవాల్సింది! పచ్చబొట్టు అయితే పొడిపించుకున్నారు కానీ, వారంతా ఓటు హక్కు వయసు కూడా లేని పిల్లలు అయితే… తన పార్టీ అలాంటి పిల్ల సేన అయితే.. ఓట్లు ఎలా పడతాయని పవన్ కల్యాణ్ అనుకుటున్నారో!
ఇక ఎన్నికల సమయంలో.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలనూ, యూపీ నుంచి మాయవతిని పిలిపించుకుని ఆమె కాళ్ల మీద పడి, ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన పవన్ కల్యాణ్.. తను ఒంటరిగా పోరాడినట్టుగా ప్రకటించుకోవడం జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నమే. ఇలాంటి పూలు ఎన్నింటినో పెట్టే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటో పవన్ కల్యాణ్ అర్థం చేసుకోవాలి. జులాయి మాటలకు, జల్సా చేష్టలకు, పోకిరి వేషాలకూ… ప్రజలు ఓట్లు వేయరని ఈ సినిమా హీరోకి ఇంకా మరిన్ని ఎన్నికలను ఎదుర్కొన్నా అర్థం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు!