రెండున్నరేళ్ల తర్వాత వైఎస్ జగన్‌లో పాదయాత్ర నాటి ఆత్మీయతను చూస్తున్నట్టు సోషల్ మీడియా హోరెత్తుతోంది. మళ్లీ పాదయాత్ర నాటి జగన్‌ను చూస్తున్నామని వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జనం మధ్యకు రావడమే మానేశారనే విమర్శ ఉంది.
ఇటీవల తుపాను ప్రభావంతో కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రాణి, ఆస్తి, పంట నష్టాలు సంభవించాయి. వరద బాధితులను పరామర్శించి, వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చేందుకు వైఎస్ జగన్ నిన్న, ఇవాళ ఆ మూడు జిల్లాల్లో పర్యటన చేపట్టారు.
ముందుగా గురువారం వరద ప్రభావిత ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వెదళ్లచెరువు ఎస్టీ కాలనీ, పాపానాయుడుపేట గ్రామాల్లో పర్యటించారు. ధ్వంసమైన ఇళ్లు, వంతెనలను పరిశీలించారు. పులపత్తూరులో కాలినడకన గ్రామం మొత్తం కలియ దిరుగుతూ బాధిత మహిళలతో ఆత్మీయంగా మాట్లాడారు.
జగన్‌ను చూడగానే వాళ్లలో ఒక్కసారిగా కష్టాలు తొలిగిపోతాయనే నమ్మకం కలిగిన భావన. వాళ్ల కళ్లలో ఆనందం కనిపించింది. వాళ్ల తలలపై చేయి వేసి అండగా ఉంటాననే సంకేతాల్సి ఇవ్వడం… ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఆప్యాయతను గుర్తు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరు జిల్లా పర్యటనలో కూడా బాధితులను పరామర్శించినప్పుడు ఇదే రకమైన భరోసా. ఇటు జగన్, అటు బాధిత ప్రజానీకం నుంచి కూడా ఆప్యాయత కనిపించింది. ముఖ్యమంత్రి జగన్ ఎదుట బాధితులు తమ గోడును వినిపించారు. జగన్ ఎంతో శ్రద్ధాసక్తులతో అన్నీ విన్నారు. అక్కడికక్కడే భరోసా కల్పించే చర్యలు తీసుకున్నారు. కొందరికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. బాధితుల పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అలాగే పంట నష్ట పరిహారానికి హామీ ఇచ్చారు. ఇళ్లను కట్టిస్తానని ఇంటి పెద్ద కొడుకులా ధైర్యాన్ని ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన తిరుపతినగరంలోని శ్రీకృష్ణానగర్‌లో ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున జగన్‌తో సెల్ఫీలు దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పుట్టెడు దుఃఖంలోనూ జగన్ కనిపించగానే వారిలో తెలియని ఆనందం.
జగన్ అండగా నిలుస్తారనే నమ్మకాన్ని బాధితుల కళ్లలో చూడొచ్చు. తాను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా, వారి కుటుంబ సభ్యుడిలా జగన్ ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకోవడం బాధితుల హృదయాల్ని ఆకట్టుకుంది.