ఆయన ఓ బాధ్యత కలిగిన డీఎంహెచ్ఓ. డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. కరోనాపై కానీ, ఇతర వ్యాధులపై కానీ ప్రజల్ని అప్రమత్తంగా ఉంచాల్సిన బాధ్యత ఆయనది. అలాంటి వ్యక్తి అందరికీ కరోనా అంటించాడు. అది కూడా తనకు తెలిసీ తప్పు చేశాడు. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓ కోట చలం.. తెలిసి తెలిసీ ఈ తప్పు చేశారు.
సూర్యాపేట డీఎంహెచ్ఓ కోట చలం కుమారుడు 5 రోజుల క్రితం జర్మనీ నుంచి వచ్చాడు. జర్మనీలో ప్రస్తుతం ఒమిక్రాన్ విజృంభిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. దక్షిణాఫ్రికా తర్వాత కొత్త వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతోంది జర్మనీలోనే. ప్రస్తుతం అక్కడ పూర్తి స్థాయిలో లాక్ డౌన్ కూడా అమలులోకి వచ్చింది. సరిగ్గా లాక్ డౌన్ కి ముందే కోట చలం కొడుకు సూర్యాపేటకు వచ్చేశాడు. వస్తూ వస్తూ కరోనాని తీసుకొచ్చాడు.
విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వ్యక్తిని, అందులోనూ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న జర్మనీ నుంచి వచ్చిన వ్యక్తిని కచ్చితంగా వారం రోజులు ఐసోలేషన్లో ఉంచాల్సిన పరిస్థితి. కానీ డీఎంహెచ్ఓ మాత్రం కొడుకు, కుటుంబంతో కలసి ఎంచక్కా తిరుమల యాత్రకి వెళ్లొచ్చారు. అయితే తిరుమల నుంచి వచ్చాక కుటుంబ సభ్యులకు కొవిడ్ లక్షణాలు కనపడటంతో హడావిడి పడ్డారు. వెంటనే పరీక్షలు చేయించుకోగా కొవిడ్ నిర్థారణ అయింది.
తప్పు మీద తప్పు..
విదేశాల నుంచి వచ్చిన కొడుకుని ఐసోలేషన్ లో ఉంచకుండా తిరుమల తీసుకెళ్లడం కోట చలం చేసిన మొదటి తప్పు అయితే, ఆ కొడుకుతో తిరిగి కుటుంబ సభ్యులు కొవిడ్ బారిన పడినా కూడా.. తనకు లక్షణాలు లేవు కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం కోట చలం చేసిన రెండో తప్పు.
ఎయిడ్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కోట చలం పలువురు సిబ్బందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఆ తర్వాత తీరిగ్గా కొవిడ్ పరీక్ష చేయించుకోగా అతనికి కూడా పాజిటివ్ అని తేలింది. జర్మనీ నుంచి వచ్చిన కొడుకు అంటించిన వైరస్ కాబట్టి.. ఇప్పుడు అందర్లో ఒమిక్రాన్ భయం పట్టుకుంది.
ఎయిడ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఇప్పుడు హడలిపోతున్నారు. ఇక కోట చలంతో కలిసి తమకు తెలియకుండానే దర్శనం చేసుకున్న భక్తుల సంగతి ఆ దేవుడికే తెలియాలి.
అన్నీ తెలిసి ఎందుకిలా..?
అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పే అధికారులే ఇలా తప్పుమీద తప్పు చేస్తే ఇక సామాన్యుల సంగతేంటి..? విదేశాల నుంచి వచ్చేవారిని పట్టి పట్టి చూసే అధికారులు.. కోట చలం కొడుకు విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు.
మాస్క్ లేకపోతేనే వెయ్యి రూపాయల జరిమానా అంటున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇలాంటి తప్పులు చేసినవారికి ఎంత జరిమానా వేయాలి. పోనీ వైద్యరంగానికి సంబంధంలేని వ్యక్తి, అవగాహన లేకుండా ఇలాంటి పని చేస్తే అది వేరే సంగతి. సాక్షాత్తూ డీఎంహెచ్ఓ ఇలా చేశారంటే ఇక ఎవరిని నిందించి ఏం ప్రయోజనం.
ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ కరోనా భయం నుంచి బయటపడి, మూడో వేవ్ ముప్పుపై ప్రజలంతా భయపడుతున్న ఈ టైమ్ లో వైద్యరంగంలోని ఉన్నతాధికారి ఇలా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.