మద్య నియంత్రణకు ఇది మాస్టర్ ప్లానే!

మద్యంపై జగన్మోహనరెడ్డి బ్రహ్మాస్త్రం ప్రయోగించారు! మద్యం కొనుగోలు చేయదలచుకున్న వాళ్లు అయిదువేల రూపాయల విలువైన కార్డు తీసుకుని… దాని ద్వారా మాత్రమే మద్యం కొనుగోళ్లు చేయాలనే కొత్త నిబంధనను జగన్ ప్రభుత్వం తీసుకువస్తోందనే ప్రచారం…

మద్యంపై జగన్మోహనరెడ్డి బ్రహ్మాస్త్రం ప్రయోగించారు! మద్యం కొనుగోలు చేయదలచుకున్న వాళ్లు అయిదువేల రూపాయల విలువైన కార్డు తీసుకుని… దాని ద్వారా మాత్రమే మద్యం కొనుగోళ్లు చేయాలనే కొత్త నిబంధనను జగన్ ప్రభుత్వం తీసుకువస్తోందనే ప్రచారం  ముమ్మరంగా జరుగుతోంది.

ఈ ప్రచారం నిజమే అయితే గనుక… మద్యనిషేధాన్ని దశల వారీగా అమల్లోకి తెస్తాం అని ప్రకటించిన జగన్మోహన రెడ్డి ఎంతో సంకల్ప శుద్ధితో వ్యవహరిస్తున్నట్లు లెక్క. ఈ కార్డులు వినియోగంలోకి వస్తే.. ఖచ్చితంగా మద్యం వినియోగం తగ్గుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మద్యం నియంత్రణకు ఇది మాస్టర్ ప్లాన్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మీడియా చానెళ్లలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి.. ప్రభుత్వం కొత్తగా అయిదువేల రూపాయల విలువైన మద్యం కార్డులను ప్రవేశ పెడుతుంది. కొనుగోళ్లకు ఆ కార్డులనే వాడాల్సి ఉంటుంది.

అయిదువేల రూపాయల విలువైన మద్యం కొనుగోలు తర్వాత మళ్లీ రీచార్జి చేసుకోవాల్సి ఉండొచ్చు. అలా మద్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇలాంటి కార్డుల వల్ల మద్యం వినియోగం రాష్ట్రంలో ఒక్కసారిగా గణనీయంగా పడిపోతుంది. మద్యం ప్రియులు ఎంతగా అందుకోసం డబ్బు తగలేసే అలవాటు ఉన్నప్పటికీ… ఒక్కసారిగా అయిదువేల రూపాయలు వెచ్చించి కార్డు కొనడం అనేది చాలా మందికి భారం అవుతుంది.

పేదవర్గాలనుంచి ఉండే మద్యం ప్రియులు ఎప్పుడు జేబులో కొంత డబ్బు సమకూరితే అప్పుడు మద్యం తీసుకుని…తాగుతుంటారు. అలాంటి వారందరికీ ఈ కొత్త విధానం చాలా ఇబ్బందికరం అవుతుంది. మధ్యతరగతి వారు ఒకేసారి అయిదువేల కార్డులు కొనడం కుదురుతుందేమో గానీ పేదలకు సాధ్యం కాదు.

పైగా ఇలాంటి కార్డుల విక్రయాల వల్ల ప్రభుత్వానికి ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు సమకూరుతుంది. ఎటూ ఇప్పుడు మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి గనుక.. సొమ్ము భారీగా ప్రభుత్వ ఖజానాకు జమవుతుంది. విస్తారంగా సంక్షేమపథకాలు ప్రకటించిన జగన్ సర్కారుకు తక్షణ వినియోగానికి డబ్బు అంది వస్తుంది.

అయితే.. అయిదువేల రూపాయల కార్డులతో పాటూ.. విడిగా కూడా మద్యం విక్రయాలు ఉంటాయని.. దీనివల్ల ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చునని కూడా కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు స్పష్టత రాదు.