గోతికాడ నక్క రాజకీయాలు

ఎంత త్వరగా భాజపాకు వైకాపాకు దూరం పెరిగిపోతుందా? ఎంత వేగిరం జగన్ ను భాజపా టార్గెట్ చేస్తుందా? అప్పుడు మరే పార్టీ వుండదు కనుక, తేదేపా-భాజపా మళ్లీ కలిసిపోవచ్చు. ఆ అండతో ఆంధ్రలో రాజకీయం…

ఎంత త్వరగా భాజపాకు వైకాపాకు దూరం పెరిగిపోతుందా? ఎంత వేగిరం జగన్ ను భాజపా టార్గెట్ చేస్తుందా? అప్పుడు మరే పార్టీ వుండదు కనుక, తేదేపా-భాజపా మళ్లీ కలిసిపోవచ్చు. ఆ అండతో ఆంధ్రలో రాజకీయం సాగించి, అధికారం తెచ్చుకుని,మళ్లీ మనమూ, మన వర్గం చెలరేగిపోవచ్చు. ఇదీ తెలుగుదేశం పార్టీ అండతో అయిదేళ్ల పాటు అధికారం వెలగబెట్టి, కోట్లు ఆర్జించిన వారి వైఖరి. 

పులి ఎప్పుడు వేటాడుతుందా, తినేసి, మిగిలింది వదిలేసి వెళ్లిపోతుందా? మనం ఈజీగా, ఏ వేటా సాగించకుండా తినేయచ్చు కదా? అని చూడడం నక్క నైజాం. దీనినే గోతికాడనక్క రాజకీయం అంటారు. తేదేపా తరపున, దానిని నమ్ముకున్నవారు, దాని ద్వారా బతుకుతున్నవారు సాగిస్తున్న రాజకీయం ఇలాగే వుంది.

మోడీ నో, షా నో జగన్ కో కేసిఆర్ కో అపాయింట్ మెంట్ ఇవ్వకుంటే ఎంత ఆనందమో? అయిపోయింది. భాజపా తో కేసిఆర్ కు, జగన్ కు చుక్క ఎదురు అయిపోతే ఆ ఫ్లేస్ ను తేదేపా భర్తీ చేస్తే ఓ పనైపోతుంది అన్న ఆనందం. ఈ ఆనందంలో ఏం రాతలు రాస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఈ రోజు వచ్చిన ఓ కథనం భలే చిత్రంగా వుంది. ఎలాగైనా భాజపాకు వైకాపాకు తెగతెంపులు జరిగేలా చూడాలని, దాంతో కథ దానంతట అదే మలుపు తిరిగి తెలుగుదేశానికి పూర్వ వైభవం వస్తుందని తహతహలాడుతున్నారు అనడగానికి ఇదే ఉదాహరణ అన్నట్లు గా వుంది ఆ కథనం.

''..బీజేపీ వ్యతిరేక పార్టీలతో జగన్‌ సంబంధాలు నెరపుతున్నారని అగ్ర నేతలు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. తాజాగా జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమికి జగన్‌ ఆర్థిక సహాయం చేస్తున్నారేమోనన్న అనుమానాలు పార్టీ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ‘‘ఒకవైపు మా ప్రత్యర్థి పార్టీలతో సంబంధం కొనసాగిస్తూనే, మరోవైపు మాతో స్నేహం నటించి, కేసుల విషయంలో సహాయం పొందడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం గ్రహించకపోవడానికి మేమేమీ అమాయకులం కాదు’’ అని బీజేపీ ముఖ్య నేత ఒకరు తెలిపారు…''

ఇదీ అల్లిన కథ.

ఎన్నికలు నాలుగున్నరేళ్ల దూరంలో వున్నాయి. ఇప్పుడు భాజపా వ్యతిరేక పార్టీలతో ఇప్పుడు సంబంధాలు నెరపాల్సిన పనే ముంది?  ఆ వ్యతిరేక పార్టీలు ఏమన్నా బలంగా వున్నాయా? అవేమన్నా భాజపాను నిలవరించగలవా?  గట్టిగా గొంతు వినిపించగలవా? మరి ఎందుకు వాటితో అంత రహస్య సంబంధాలు నెరపాలి. 

పోనీ ఇలా భాజపా ఇలా భావిస్తోంది అనుకుందాం? అప్పుడు మాత్రం చంద్రబాబును దగ్గరకు తీసుకుంటుందా? ఇక్కడ భాజాపా ఇలా భావిస్తోంది అని ఈ మీడియా భావిస్తోంది.

కానీ చంద్రబాబు నిజంగానే, బహిరంగంగానే భాజపా వ్యతిరేక పార్టీలతో జట్టు కట్టారు కదా? ఎన్నికల ముందు ఆయన నేరుగానే మోడీని ఢీకొన్నారు. ఆయన మీడియా అమిత్ షా ను మాంత్రికుడు, మాయల మరాఠీ అన్నట్లుగా వార్తలు వండి వార్చింది. చంద్రబాబు నేరుగానే చెన్నయ్, ఢిల్లీ, యుపి, బెంగాల్ తిరిగి మరీ మోడీని ఆయన పార్టీని ఓడించాలని గట్టి కృషి చేసారు.

ఇక జగన్ విషయానికి వస్తే, ఆయన ఎప్పుడయినా కాంగ్రెస్ కు చేరువ కాగలరా? తనను జైలుకు పంపిన సోనియా పక్కన కూర్చుని మంతనాలు జరపగలరా?

మరి భాజపాకు ఎవరు బెస్ట్? నేరుగానే ప్రతిపక్షాలతో సంబంధాలు పెట్టుకుని, నేరుగానే మోడీని ఢీకొని, నేరుగానే మోడీని అనేక తిట్లు తిట్టి, ఏ వేళ ఎవరి పంచన చేరడానికి సిద్దంగా వున్న చంద్రబాబు బెటర్ నా?

అంటే భాజపా స్వంత కాళ్ల మీద లేవలేదు. జగన్ ను దూరం అయితే ఎన్ని మచ్చలు, మరకల నేపథ్యం వున్నా చంద్రబాబే బెటర్ అని అనుకుంటుందని ఈ మీడియా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.ఆ ఆశతోనే ఇలాంటి కథనాలు వండి వారుస్తున్నట్లుంది. ఎన్ని స్టోరీలైనా రాసుకోవచ్చు..' తెలిసింది..తెలుస్తోంది..తెలుస్తుంది.' అంటూ వాక్యాలు రాసుకుంటూ పోతుంటే.
లేదూ అంటే ఈ వాక్యాలు చూడండి

''….. ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు ఆర్థిక కష్టాలతో అన్‌ పాపులర్‌ (జనాదరణ కోల్పోయే) పరిస్థితి సృష్టించి, ఆ దశలో రాజకీయంగా తాను పాగా వేయాలన్నది బీజేపీ ఎత్తుగడ అని ప్రాంతీయ నేతలు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అవలంబించాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు….''

ఇక్కడ మళ్లీ భాజపా భావిస్తోంది అని కాదు. ప్రాంతీయ నేతలు భావిస్తున్నారు అని రాయడం. భాజపా భావిస్తోంది అని రాస్తే, మచ్చ ఆ పార్టీ మీద పడి మళ్లీ తమ మీద, తమ మద్దతు వున్న తేదేపా మీద కోపం వస్తుందేమో అన్న అనుమానంతో ఇలా చాలా పకడ్బందీగా రాయడం. 
ప్రాంతీయ నేతలు భావిస్తున్నారట. భావించడం వరకు ఎందుకు? గతంలో చంద్రబాబు నేరుగానే విధంగా మాట్లాడారు కదా? అప్పుడే మరిచిపోయారా?

మొత్తం మీద ఈ ఆదివారం ఈ స్టోరీతో కడుఫు నిండింది. మళ్లీ మరో స్టోరీ ఎప్పుడు వండి వారుస్తారో? ఎలా వారుస్తారో వేచి చూడాల్సిందే.