కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా చాలామంది తల ఎగరేసినోళ్లు ఉన్నారు. తెలంగాణ నాయకులే కాదు, రాయలసీమకు చెందిన డీఎల్ రవీంద్రా రెడ్డి వంటి వాళ్లు కూడా వైఎస్సార్ కి ఎదురెళ్లారు. అధిష్టానం అండదండలు చూసుకుని ఎగిరెగిరి పడ్డారు. ఒక రకంగా వీరందర్నీ కాంగ్రెస్ అధిష్టానమే అలా రెబల్స్ లా తీర్చిదిద్దింది. వైఎస్సార్ పవర్ సెంటర్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసింది.
వైఎస్సార్ ని ఎదిరించి వీరు ఎంత లాభపడ్డారో తెలియదు కానీ, అధికారంలో ఉన్నన్ని రోజులూ పక్కలో బల్లాలను పెట్టుకునే పాలన చేశారు వైఎస్సార్. కానీ వైఎస్ తనయుడు జగన్ కు అలాంటి పరిస్థితి లేదు. ఇది ప్రాంతీయ పార్టీ, ఇక్కడ అధినాయకుడైనా, అధిష్టానమైనా అంతా వైఎస్ జగనే. వైఎస్సార్ ని ఎదిరించి కాంగ్రెస్ లో చాలామంది మనగలిగి ఉండొచ్చు కానీ, జగన్ ని ఎదిరించి వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండాలంటే అది దుస్సాహసం.
సరిగ్గా ఇదే విషయంలో తప్పు చేశారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఎంతైనా కాంగ్రెస్ లో ఉండి వచ్చిన నాయకులు కదా, అలాంటి భావాలతోనే సొంత పార్టీ నేతల్ని సైతం ధిక్కరించి మాట్లాడారు. జగన్ టీమ్ ని అవమానిస్తే, జగన్ ని అవమానించినట్టే. అందుకే జగన్ తొందరగానే మేల్కొన్నారు. ధిక్కార స్వరాలను సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇది కాంగ్రెస్, కాదని వైఎస్సార్ కాంగ్రెస్ అని, ఇక్కడ ఏదైనా జగన్ నిర్ణయం ప్రకారమే జరుగుతుందని విజయసాయిరెడ్డి ద్వారా చెప్పించారు.
ఇది కేవలం రామనారాయణ రెడ్డికి మాత్రమే ఇచ్చిన వార్నింగ్ కాదు, ఇలాంటి వాళ్లు ఇంకా కొంతమంది పార్టీలో ఉన్నారని, ఒకరికొకరు మంతనాలు సాగించే సమయంలో పార్టీ గురించి, తన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారనే విషయం జగన్ దృష్టికి వచ్చింది. అందులోనూ మంత్రి మండలిలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం, కొత్తవారికి ప్రాధాన్యమివ్వడం కూడా ఓ వర్గానికి రుచించలేదు. ఈ వర్గమే ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించేందుకు ధైర్యం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే ఒకే దెబ్బకు అందరి నోళ్లూ మూయించేలా జగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రామనారాయణ రెడ్డి పేరిట అందర్నీ ఒకేసారి హెచ్చరించారు. అసంతృప్తిని ఆదిలోనే అరికట్టేలా కాస్త గట్టిగానే వ్యవహరిస్తున్నారు. ఇకపై ఆనం తరహాలో ఏది పడితే అది మాట్లాడ్డానికి మరే ఇతర వైసీపీ నేత తెరపైకి రాకపోవచ్చు.