కేంద్ర‌మంత్రిని కోర్టుకీడ్చిన సామాన్యుడు

తల్లి చేయ‌లేని మేలు ఉల్లి చేస్తుందంటారు. మేలు క‌థేమోగానీ, కేంద్ర‌మంత్రి పాశ్వాన్‌పై మాత్రం మోస‌గాడి ముద్ర వేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు వాటిని కొన‌లేని దుస్థితి. Advertisement…

తల్లి చేయ‌లేని మేలు ఉల్లి చేస్తుందంటారు. మేలు క‌థేమోగానీ, కేంద్ర‌మంత్రి పాశ్వాన్‌పై మాత్రం మోస‌గాడి ముద్ర వేస్తోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులు వాటిని కొన‌లేని దుస్థితి.

ఉల్లి ధ‌ర‌ల ఘాటుతో ఆగ్ర‌హించిన ఓ వ్య‌క్తి ఏకంగా కేంద్ర‌మంత్రి పాశ్వాన్‌పై కోర్టులో పిటిష‌న్ వేసి క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయించాడు.  ఇంత‌కూ కేంద్రంలో అంత మంది మంత్రులు ఉండ‌గా పాశ్వాన్‌పై ఎందుకు పెట్టార‌నుకుంటున్నారా? అక్క‌డికే పోదాం.

కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల‌, ఆహార‌, ప్ర‌జాపంపిణీ మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌ల‌ను పాశ్వాన్ నిర్వ‌ర్తిస్తున్నాడు. అంటే వినియోగ‌దారులకు కూర‌గాయ‌లు, ఇత‌ర వంట స‌రుకులు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు అందించాల్సిన బాధ్య‌త పాశ్వాన్‌ద‌న్న మాట‌.

దేశంలో రోజురోజుకూ ఉల్లి ధ‌ర‌లు పెరుగుతూ ఆకాశాన్నంటాయి. ఉల్లి ధ‌ర‌ల‌ను అంచ‌నా వేయ‌డంలో కేంద్ర‌మంత్రి అంచ‌నా వేయ‌డంలో విఫ‌లం కావ‌డమే కాకుండా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే రీతిలో రోజుకో మాట చెబుతున్నారంటూ ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన ఎం.రాజున‌య్య‌ర్ శ‌నివారం స్థానిక కోర్టులో కేసు వేశాడు. దీంతో మంత్రిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది.  

బ్లాక్‌మార్కెట్ వ‌ల్లే ఉల్లిపాయ‌లు, కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరిగాయ‌ని ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని పాశ్వాన్‌పై ఫిర్యాదు మేర‌కు కోర్టు స‌ద‌రు మంత్రిపై ఐపీసీ సెక్ష‌న్ 420, 506, 379 కింద కేసు న‌మోదు చేసింది.  ఈ నెల 12న విచార‌ణ చేయ‌నున్న‌ట్టు కోర్టు త‌న లిస్టింగ్ ద్వారా పేర్కొంది.  అమ్మో ఉల్లి ఘాటు సామాన్య‌మైంది కాదు క‌దా పాశ్వాన్‌.