పోలీసులను తప్పుపట్టే ముందు…

దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం మీద హర్షాతిరేకాలు వ్యక్తమైన రీతిలో.. అందులో ఓ పదిశాతం మందినుంచి నిరసనలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ‘పోలీసులపై దాడిచేసి, తుపాకులు లాక్కుని కాల్చడానికి ప్రయత్నించగా చేసిన…

దిశ కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం మీద హర్షాతిరేకాలు వ్యక్తమైన రీతిలో.. అందులో ఓ పదిశాతం మందినుంచి నిరసనలు, విమర్శలు కూడా వస్తున్నాయి. ‘పోలీసులపై దాడిచేసి, తుపాకులు లాక్కుని కాల్చడానికి ప్రయత్నించగా చేసిన ఎదురుకాల్పుల్లో వారు మరణించారు’ అనే ప్రకటనను ఎవ్వరూ నమ్మడం లేదు.

కానీ పోలీసులు చట్టం, న్యాయం జోలికి పోకుండానే.. వారిని కడతేర్చేయడాన్ని ఆ కొద్దిమంది గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దిశకు జరిగిన అన్యాయం నేపథ్యంలో.. ఆ ఆవేశంలో అందరూ కూడా ఎన్కౌంటర్ ను సమర్థిస్తారు గానీ.. విమర్శలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.కానీ.. విమర్శించే వాళ్లు కూడా.. పోలీసులను తప్పుపట్టే ముందు.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే మాటలను గమనించాలి.

తక్షణ న్యాయం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు… అని జస్టిస్ బోబ్డే అన్నారు. అది నూటికి నూరుశాతం నిజమే. కానీ, జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డెనీడ్ (justice delayed is justse denied) అనే మాట కూడా చాలా ముఖ్యమైనది. వాస్తవమైనది. తక్షణ న్యాయం అడగడం కూడా సబబు కాదు.

విచారణ పూర్తికాకుండా ఏదీ తేల్చడం మన ప్రజాస్వామిక దేశంలో ఊహించలేం. అయితే.. సత్వర న్యాయం ఆశించడం కూడా తప్పే అనుకుంటే ఎలా? నిర్భయ కేసు ఇన్ని సంవత్సరాలుగా ఇంకా ఎందుకు నానుతూనే ఉంది?

ఒక యంత్రాంగం తప్పు చేసిన వారిని పట్టుకుంటుంది.. మరో యంత్రాంగం వాళ్లు తప్పుచేసింది నిజమేనని తేలుస్తుంది. ఇలా తేల్చడానికి కొన్ని దశాబ్దాలు గడచిపోతూ ఉంటే.. ఇక శిక్షలు పడేదెప్పటికి? తప్పులు ఆగేదెప్పటికి?  తప్పుచేసిన వారిని పట్టుకున్న వారు ఇన్నేళ్ల నిరీక్షణలో అసహనానికి గురికావడం సహజం.

వ్యవస్థలలో ఉన్న ఈ జాప్యం.. ఎన్ కౌంటర్ వంటి విపరీత నిర్ణయాలకు పురిగొల్పుతుండవచ్చు అనుకుంటే ఎలా కాదనగలం?

జస్టిస్ బోబ్డే మాటలు కరక్టే. కానీ.. కొన్ని ప్రత్యేక తరగతికి చెందిన క్రిమినల్ కేసుల్లో ఒక నిర్దిష్టమైన డెడ్‌లైన్‌తో తీర్పు వెలువరించేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు న్యాయవ్యవస్థ సుముఖంగా ఉండాలి.

సత్వరతీర్పులను వెలువరించి.. బాధితుల్లో ఎలాంటి అసహనం ప్రబలకుండా చూడాలి. అప్పుడిలాంటి- నమ్మలేని విషయాలను కారణాలుగా చూపించే ఎన్ కౌంటర్లు ఖచ్చితంగా ఆగుతాయి.