ఘోరం జరిగిపోయింది. ఢిల్లీ చరిత్రలోనే రెండో అతిపెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున అనాజ్ మండి ఏరియాలోని ఓ భవంతిలో మంటలు వ్యాపిస్తే అంతా దీన్నొక చిన్న ప్రమాదం అనుకున్నారు. ముందు 10 మంది మృతులన్నారు, ఆ తర్వాత ఆ సంఖ్య అమాంతం 35కు చేరింది. ఇప్పుడు ఏకంగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 43కు చేరడం బాధాకరం.
1997లో ఢిల్లీలోని ఓ సినిమా హాల్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అప్పటి దుర్ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదం ఇదే. ఆ తర్వాత ఈరోజు జరిగిన దుర్ఘటన రెండో అతిపెద్ద ప్రమాదంగా నిలిచింది. ఇప్పటికే మృతుల సంఖ్య 43కు చేరగా.. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.
భవంతిలో మరికొంతమంది చిక్కుకొని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వాళ్లు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని ఇప్పటికే అంతా నిర్థారణకు వచ్చేశారు. ఈ భవనంలో నిద్రిస్తున్న వాళ్లంతా స్థానికంగా పనిచేసుకునే కార్మికులే. వాళ్లంతా నిద్రిస్తున్న సమయంలో వేకువజామున మంటలు చెలరేగాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అంచనాకు వచ్చినప్పటికీ, అసలు కారణాలేంటనేది దర్యాప్తు జరపాల్సి ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘటనా స్థలానికి వెళ్లి స్వయంగా సహాయక చర్యల్ని పర్యవేక్షించారు.