ఆర్‌కే చాణక్య రాత‌లు

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ రూటే స‌ప‌రేటు. న‌చ్చితే ఆకాశానికి ఎత్త‌డం, న‌చ్చ‌క‌పోతే పాతాళానికి తోసేయ‌డం ఆయ‌న రాత‌ల స్వ‌భావం. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏం ప‌ని ప‌డింది గానీ, ఈ వారం కొత్త‌ప‌లుకులో ఆయ‌న్ను…

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ రూటే స‌ప‌రేటు. న‌చ్చితే ఆకాశానికి ఎత్త‌డం, న‌చ్చ‌క‌పోతే పాతాళానికి తోసేయ‌డం ఆయ‌న రాత‌ల స్వ‌భావం. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏం ప‌ని ప‌డింది గానీ, ఈ వారం కొత్త‌ప‌లుకులో ఆయ‌న్ను ఆకాశ‌మే హ‌ద్దుగా కీర్తించారు. ఊరికే పొగ‌డ‌రు మ‌హానుభావుడు ఆర్‌కే గారు.

ఒక‌ప్పుడు ఆర్‌కే దృష్టిలో ప‌చ్చి నియంతైన కేసీఆర్‌…ఉన్న‌ట్టుండి అప‌ర‌చాణ‌క్యుడిగా రూపాంత‌రం చెంద‌డం వెనుక ర‌హ‌స్యం ఏంటో అర్థం కావ‌డం లేదు. ఈ పెనుమార్పు కేసీఆర్‌లోనా, లేక ఆర్‌కేలో వ‌చ్చిందా?

కేసీఆర్ గురించి కొత్త‌ప‌లుకులులో పేర్కొన్న ఒక‌ట్రెండు అంశాల గురించి ప్ర‌స్తావిస్తాను.

‘చాణక్యుడికే రాజనీతిని బోధించే సత్తా ఉన్న నేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు! ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనే కాకుండా దిశ ఉదంతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాణక్య నీతినే ప్రదర్శించారు. చట్టాలను గౌరవించాలనుకునేవారికి వాయిస్‌ లేకుండా చేశారు.  నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతించి ఉండకపోతే ఈ ఎన్‌కౌంటర్‌ జరిగి ఉండేది కాదు. చాణక్య రాజనీతిని ఒంటబట్టించుకున్న కేసీఆర్‌.. ప్రజలలో భావోద్వేగాలను గమనించి ఎన్‌కౌంటర్‌కు అనుమతించడం ద్వారా శభాష్‌ అనిపించుకున్నారు’  

 ‘విధుల్లో చేర్చుకోండి మహాప్రభో..’ అని కార్మికులు వేడుకునే పరిస్థితి వచ్చేవరకు వేచి ఉండి, అప్పుడు కేసీఆర్‌ తన చాణక్యనీతిని ప్రదర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ను గ్రేట్‌ అనకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? కేసీఆర్‌ ఎత్తుగడలను పసిగట్టలేని వారు మాత్రం బోల్తా పడుతూనే ఉంటారు.

జాతీయ స్థాయిలో అపర చాణుక్యుడుగా గుర్తింపు పొందిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా ఒక సందర్భంలో కేసీఆర్‌ తెలివి తేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. కేసీఆర్‌ చర్యలన్నీ ప్రారంభంలో అరాచకంగా కనిపిస్తాయి.

చివరకు ప్రత్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తాయి.  వేలాది పుస్తకాలను పఠించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. చాణక్యుడి రాజనీతి శాస్త్రాన్ని ఔపోసన పట్టకుండా ఎందుకుంటారు? తెలంగాణ సమాజం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌కు చాణక్య నీతిని ఎప్పుడు ప్రదర్శించాలో కూడా బాగా తెలుసు!’  

 కేసీఆర్‌ చర్యలన్నీ ప్రారంభంలో అరాచకంగా కనిపిస్తాయని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. బ‌హుశా కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో ఏబీఎన్‌ను నిషేధించ‌డం కూడా ఇప్పుడు చాణ‌క్య నీతిగా క‌నిపిస్తుందేమో.

అయితే ఈ వారం కొత్త ప‌లుకులో ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఎందుక‌నో రాధాకృష్ణ జాలి చూపాడు. ఒక్క మాట కూడా జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న లేకుండా రాయ‌డం బహుశా ఆయ‌న రాసిన మొత్తం వ్యాసాల్లో ఇదేనేమో.

ఏదైతేనేం ఒక చాణ‌క్యుడిని గుర్తించాలంటే మ‌రో చాణ‌క్యుడి వ‌ల్లే సాధ్యం. ఆ విధంగా మ‌న రాధాకృష్ణ మొత్తం వ్యాసంలో కేసీఆర్‌ను అద్భుత‌మైన చాణ‌క్యుడిగా తెలుగు స‌మాజం ముందు నిల‌బెట్టేందుకు త‌నలోని చాణ‌క్య తెలివి తేట‌లు ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పొచ్చు.