తన ప్రధాన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ పంథాపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఆయన రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని పదేపదే చెప్పడం. నిజానికి యువకుడైన జగన్ రాజకీయ ఎత్తుగడల ముందు సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి అయిన చంద్రబాబు తేలిపోతున్నారు.
ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని జగన్పై ఎంతగా మానసిక దాడి చేసినా, చూస్తున్నా జనంలో వ్యతిరేకత నింపలేక పోతున్నామని చంద్రబాబు ఓ నిర్ధారణకు వచ్చారు. పైకి మాత్రం జగన్ రాజకీయ పంథాను విమర్శిస్తున్నా… అదే మెజార్టీ ప్రజలకు నచ్చుతోందని చంద్రబాబు నమ్ముతున్నారు.
ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు ఓ అవగాహనకు వచ్చారు. ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ రాజకీయ వ్యూహాలు, తన మేథస్సును మించిపోయాయని చంద్రబాబు నిర్ధారణకు వచ్చారు. కాలంతో పాటు మారిన రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు … కొత్త రాజకీయ ఎత్తుగడలు వేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా, ఆయన మాటలు వింటే అర్థం చేసుకోవచ్చు.
కాస్త ఆలస్యంగానైనా చంద్రబాబు నిద్ర మేల్కోవడం టీడీపీ భవిష్యత్ రీత్యా మంచిదే. చంద్రబాబు గొప్పతనం ఇదే. తన రాజకీయా లకు కాలం చెల్లిందని గ్రహించిన మీదట …ప్రత్యర్థి నాయకుడి రాజకీయాలకు జనం ఆకర్షితులవుతున్నారని గ్రహించడం ఆయనలో వచ్చిన మార్పునకు సంకేతం.
అందుకే పదేపదే చంద్రబాబు సమర్థతకే పెద్ద పీట వేస్తానని చెబుతున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో అసమర్థలున్నారని చంద్రబాబు గుర్తించారు. అలాంటి వారిని ప్రోత్సహిస్తుండడం వల్లే పార్టీ బలహీనపడుతోందని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఇకపై నియోజకవర్గ ఇన్చార్జి నుంచి ప్రతి స్థాయిలోనూ సమర్థులకే పెద్దపీట వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వారికి, నియోజకవర్గాల్లో దీటుగా పనిచేసే నాయకులకే భవిష్యత్లో పార్టీలో ప్రాధాన్యం వుంటుందని బాబు తేల్చి చెప్పారు.
చంద్రబాబు దృష్టిలో సమర్థత అంటే… ప్రత్యర్థి పార్టీ నాయకులు ఒక చెంప మీద కొడితే, తమ పార్టీ నేతలు రెండు చెంపలు పగలగొట్టే వాళ్లని అర్థం. నోరున్న వాళ్లదే రాజకీయం అన్న పరిస్థితుల్లో రాజకీయాలు మారాయని చంద్రబాబు ఉద్దేశం.
అయితే ఇంతకాలం తన అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై ఇష్టానుసారం సాగించిన దాడికి సోషల్ మీడియా అడ్డుకట్ట వేసిందని చంద్రబాబు ఆలస్యంగానైనా గుర్తించడం గమనార్హం. మొత్తానికి తన రాజకీయానికి కాలం చెల్లిందని, కొత్త తరంతో పాటు ప్రయాణిస్తే తప్ప మనుగడ కష్టమని చంద్రబాబు గ్రహించారు. అందుకు తగ్గట్టుగా తన పంథాను మార్చుకోవాలనే దృఢసంకల్సాన్ని 72 ఏళ్ల చంద్రబాబులో చూడొచ్చు. నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.