మహిళలకు మాయమాటలు చెప్పి, కోట్లాది రూపాయలు మోసగించిన శిల్పా చౌదరికి కోర్టులో చుక్కెదురైంది. ఆమె భర్తకు మాత్రం విముక్తి లభించింది. మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన కేసులో ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పాచౌదరికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే కేసులో ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్‌కు మాత్రం కోర్టు బెయిలు ఇచ్చింది.
శిల్పా చౌదరికి బెయిలు నిరాకరించడంతో పాటు ఐదు రోజుల పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడం గమనార్హం. అధిక వడ్డీల ఆశ చూపి సినీ, రాజకీయ సెలబ్రిటీలను మోసగించిన కేసులో ఇటీవల శిల్పా చౌదరి, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ధనవంతులైన మహిళలతో స్నేహం, వారికి మాయమాటలు చెప్పి భారీ మొత్తంలో డబ్బు వసూలు, అనంతరం తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లింది.
భర్తతో కలిసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన శిల్పాచౌదరి కిట్టీపార్టీల పేరుతో సంపన్న వర్గాల మహిళలను ఆకర్షించింది. దివా నోస్ పేరుతో పేకాట క్లబ్ కూడా నిర్వహించింది సొమ్ము చేసుకుంది. శిల్పా చౌదరి బాధితుల్లో అంతా ప్రముఖులే కావడం విశేషం. హీరో మహేశ్‌బాబు సోదరి, హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని కూడా ఉన్నారు. ఆమె రూ.2 కోట్లు మోసపోయినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన సంపన్నుల్లో వ్యాపార కుటుంబాలు, న్యాయమూర్తి, పోలీస్ ఉన్నతాధికారి, సినీ కుటుంబాలకు చెందిన మహిళలున్నారు. బయటికి చెబితే పరువు పోతుందని, అలాగని పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే పెద్ద మొత్తంలో డబ్బు పోతుందనే బెంగతో సదరు బాధితులు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల కస్టడీలో శిల్పా చౌదరి మరెన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో అనే ఉత్కంఠ నెలకుంది.